రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. గెలుపుకోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అహర్నిసలు శ్రమిస్తున్నాయి. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితం తేలనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా… అధికార కాంగ్రెస్ నుంచి నవీన్‌యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
అభివృద్ధి, సంక్షేమ నినాదంతో కాంగ్రెస్
అధికార కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రుజువు చేయాలనేది లక్ష్యం. అభివృద్ధి.. సంక్షేమ నినాదం చేస్తున్నారు. నాలుగు రోజులు రోడ్‌షో నిర్వహించారు. దాదాపు ఏడు డివిజన్లలో పర్యటించారు. పలు సామాజిక వర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక వ్యూహం రచించి డివిజనుకు ఇద్దరేసి మంత్రులను.. పది పోలింగ్ కేంద్రాలకు ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని.. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక నేతను ఇన్‌ఛార్జిగా నియమించారు. నియోజకవర్గంలో దాదాపు రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని.. సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం తన ప్రచారంలో భారాస, భాజపా లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. మూడు పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గెలిచినా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారాసతో భాజపా మిలాఖత్ అయిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ బాకీ కార్డుల ప్రచారం
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదంటూ ఆ పార్టీ బాకీ కార్డుల ప్రచారం బీఆర్ఎస్ విస్తృతంగా చేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తుండడంతో సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేటీఆర్ అన్నీ తానై వ్యూహాలు రూపొందించారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్‌షోలు చేశారు. కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించినా ఆయన పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కూడా పలువురు నేతలను క్షేత్రస్థాయిలో నియమించింది. వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదని, పింఛన్ సొమ్ము పెంచలేదని, నిరుద్యోగ భృతి అమలు కాలేదని, కల్యాణ లక్ష్మి, ఆడపిల్లలకు స్కూటీ లాంటి పథకాల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. హరీశ్‌రావుకు పితృవియోగంతో ప్రచార బాధ్యత కేటీఆర్‌పైనే పడింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని కేటీఆర్ ప్రచారంలో ఆరోపించారు. మైనార్టీలకు కేసీఆర్ మాత్రమే సంక్షేమం అందించారని, కాంగ్రెస్ ఓట్ల రాజకీయం ఆడుతోందంటూ ప్రచారం నిర్వహించారు. సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించింది. తెరవెనుక మంత్రాంగం నడుపుతోంది. పలువురి మద్దతు కూడగట్టింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనంటూ బీజేపీ
జూబ్లీహిల్స్‌లో మనుగడ కోసం బీజేపీ పోటీ పడుతోంది. ముక్కోణపు పోటీలో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి ప్రకటన జాప్యం కారణంగా ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. అన్ని డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్‌రావు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నా.. ఇతర ఓటర్ల ఐక్యత కోసం ప్రయత్నాలు జరిగాయి. భారాస, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనంటూ కిషన్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
అంతంత మాత్రంగా స్వతంత్రుల ప్రచారం
ఈసారి ఉప ఎన్నికలో భారీగా స్వతంత్రులు పోటీ పడినా పెద్దగా ప్రచారం లేదు. కొంతమంది ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పోటీకి దిగారు. నిరుద్యోగ జేఏసీ ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం వివాదంగా మారింది. ప్రచారంలో అనేక హామీలు ఇచ్చిన నాయకులు శనివారం నుంచి వ్యూహం మార్చారు. సామాజిక వర్గాలు, ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వారికి రకరకాలుగా భరోసా ఇస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి కొన్నేసి పేర్లతో విడిగా జాబితాలు తయారుచేసుకొని వారి బాధ్యతలను కీలక నాయకులకు అప్పగిస్తున్నారు.
The post Jubilee Hills By Elections: నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెర appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Jubilee Hills By Elections: నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెర
Categories: