Karnataka : కన్నడనాట సీఎం సీటు కోసం సిగపట్లు కొనసాగుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య కుర్చీలాటకు ఇప్పుడప్పుడే ముగింపు ఉండేట్టు కనబడడం లేదు. అంతా హైకమాండ్ చూసుకుంటుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కంటితుడుపు ప్రకటన చేశారు. కర్ణాటక (Karnataka) కాంగ్రెస్‌లో అసలు సమస్యే లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. మీడియా అనవసరంగా లేని విషయాన్ని ప్రచారం చేస్తోందని నిష్టూరమాడారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానంటూ మరో నాయకుడు తెరపైకి వచ్చారు.
కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 20 నాటికి రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారం ఊపందుకుంది. దీన్నే కొంత మంది ‘నవంబర్ విప్లవం’గా వర్ణిస్తున్నారు. 2023లో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార మార్పిడి ఒప్పందం కుదిరిందని.. దాని ప్రకారం ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండేందుకు అంగీకరించినట్టు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. నవంబర్ 20 నాటికి సిద్ధరామయ్య పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తయినందున, ఆయన స్థానంలో డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో కన్నడ రాజకీయాల్లో కొద్దిరోజులుగా హీట్ పెరిగింది.
Karnataka – ముఖ్యమంత్రి రేసులో ఉన్నా
సిద్ధరామయ్య, శివకుమార్ మధ్యలోకి తాజాగా హోంమంత్రి జి. పరమేశ్వర (G. Parameshwara) కూడా వచ్చారు. నాయకత్వ మార్పిడి అనివార్యమైతే తాను కూడా రేసులో ఉంటానని ప్రకటించారు. ముఖ్యమంత్రి మార్పిడిపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎవరూ ఇప్పటివరకు మాట్లాడలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ శాసనసభా పక్షంలోనూ దీనిపై చర్చించలేదని వెల్లడిచారు. కాగా, పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉందని బెంగళూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉందని ముక్తాయించారు.
ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా అని పరమేశ్వరను విలేకరులు ప్రశ్నించగా.. ”నేను ఎప్పుడూ పోటీలోనే ఉంటాను.. అది పెద్ద సమస్య కాదు. నేను 2013లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. అదంతా నా ఒక్కడి ఘనత అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. ఒకవేళ నేను గెలిచివుంటే ఏం జరిగివుండేదో నాకు తెలియద”ని బదులిచ్చారు.
ముఖ్యమంత్రిని మార్చాలని హైకమాండ్ అనుకుంటే.. మీ పేరును పరిగణనలోకి తీసుకోమ్మని కోరతారా అని అడగ్గా.. “ఆ పరిస్థితి రానివ్వండి అప్పుడు చూద్దాం, అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు” అని పరమేశ్వర అన్నారు. దళితుడిని సీఎం చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Also Read : Reverse Migration: ‘ఎస్‌ఐఆర్’ ఎఫెక్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశీయుల ఇంటిబాట
The post Karnataka: కర్ణాటక సీఎం రేసులో జి. పరమేశ్వర ? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Karnataka: కర్ణాటక సీఎం రేసులో జి. పరమేశ్వర ?
Categories: