జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ ప్రజానీకానికి ఒక కనువిప్పు అవుతుందని చెప్పారు. తమ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అధికార మార్పిడి జరగకపోవచ్చు. కానీ మేం కొట్లాడేది ఈ ఒక్కసీటు గెలవడంకోసం కాదు… ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది బయటపడుతుంది. రేవంత్‌రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ మరో 15ఏళ్లు గెలిచే పరిస్థితి ఉండదు. మీడియా మేనేజ్‌మెంట్‌తో ఎన్నిరోజులు మభ్యపెడతారు. ప్రజలు తిప్పికొట్టబోతున్నారని, అధిష్ఠానానికి విషయం తెలిసిపోతుందని రేవంత్‌రెడ్డి భయపడుతున్నారు. అందుకే ఏ సీఎం కూడా తిరగనంతగా గల్లీల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు.
గతంలో ఏ సీఎం అయినా కుల సంఘాలతో మీటింగ్ పెట్టిన ఉదంతాలు ఉన్నాయా? ఈ సీఎం పెడుతున్నారు. సినీ కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు’’ అని కేటీఆర్ విమర్శించారు. గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మెజారిటీతో బీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటూ గెలవని అంశాన్ని ప్రస్తావించగా.. పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం దేశం మోదీకి వ్యతిరేకమా, అనుకూలమా అన్నట్టు చీలిపోయిందని, ఎన్డీయేలోగానీ, ఇండి కూటమిలోగాని లేని పార్టీలకు సీట్లు రాలేదని కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి
రాష్ట్రంలో బీజేపీ రెండేళ్లుగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘బీజేపీ ఒక్క సమస్యపై అయినా పోరాటం చేసిందా? బీజేపీ జైల్లో పెట్టినది మా నాయకులను. మా నాయకురాలు కవిత మీదే ఈడీ దాడులు జరిగాయి. అప్పుడు ఆమె మా నాయకురాలు. ఇప్పుడు కాదు. మరి పొంగులేటి మీద ఈడీ దాడులు జరిగితే కిషన్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సీబీఐని రాహుల్ గాంధీ రోజూ తిడతారు. కానీ రేవంత్ రెడ్డి సీబీఐకి కేసులను అప్పగిస్తారు. రేవంత్ రెడ్డి ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ అంటారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని అమిత్‌షా అంటారు. కానీ కేసులు ఉండవు. రేవంత్ రెడ్డి బావ మరిదికి కేంద్ర అమృత్ పథకంలో రూ.1.150 కోట్ల కాంట్రాక్టు వస్తుంది. రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే బీజేపీ ఎంపీలకు రెడ్ కార్పెట్లు పరిచి స్వాగతాలు పలుకుతున్నారు. అదానీకి స్వాగతం పలుకుతున్నారు. చోటా భాయ్, బడా భాయ్ సంబంధం ప్రజలకు అర్థమైంది’’ అని పేర్కొన్నారు.
అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్ అని, ఇదొక కాషాయ, పంచకూట కూటమి అని విమర్శించారు. బీజేపీ కూడా కాంగ్రె్‌సకు సహాయపడేందుకే జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తోందని.. నిన్న మొన్నటి వరకు పత్తా లేని బండి సంజయ్ ఈ రోజు హిందూ, ముస్లిం అంటూ గావుకేకలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదని, రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రి అని విమర్శించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కాంగ్రెస్ అభ్యర్థికి సహాయం చేసి, బీజేపీ అభ్యర్థిని బకరా చేసి పోతారని ఎద్దేవా చేశారు. అయితే రాహుల్ గాంధీకి బానిస అయిన కేసీ వేణుగోపాల్‌కు బానిసలా రేవంత్ పరిస్థితి ఉందని..అందుకే బీజేపీతో చీకటి ఒప్పందాలే తప్ప… కేంద్రంతో గట్టిగా మాట్లాడి నిధులు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
టీడీపీ సానుభూతిపరులు బీఆర్‌ఎస్ వైపు ?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ సానుభూతిపరులు మాగంటి సునీతకే మద్దతుగా నిలుస్తారని, బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తారని భావిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఎన్టీఆర్, పీజేఆర్ విగ్రహాలు పెడతామంటూ కాంగ్రెస్ చెప్పడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగానే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. తమ కుటుంబం కూడా కాంగ్రె్‌సకు వ్యతిరేకమేనని చెప్పారు. పీజేఆర్ మీద ఇప్పుడు ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ఆయన కుమారుడికి జూబ్లీహిల్స్‌లోగానీ, ఖైరతాబాద్‌లోగానీ టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ ఒంటరిగా పోరాడుతోందని, మిగతా పార్టీలన్నీ గుంపుగా తమ మీద పోటీపడుతున్నాయని కేటీఆర్ చెప్పారు. కాంగ్రె్‌సకు మజ్లిస్ మద్దతు ఉన్నా.. ముస్లింల ఓట్లలో అత్యధికం బీఆర్‌ఎ్‌సకే పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫార్ములా-ఈ కేసులో అవినీతి ఏమీలేకపోయినా ఏదో చేయాలని చూశారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చూపేందుకు రేవంత్‌రెడ్డి ఎన్నో విఫల ప్రయత్నాలు చేశారని విమర్శించారు. తాము అయితే విధానపరమైన అంశాలపైనే విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తామన్నారు.
The post KTR: జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండమే – కేటీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
KTR: జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండమే – కేటీఆర్
Categories: