KTR : కాంగ్రెస్ పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సోమవారం బీఆర్కే భవన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్ (KTR). ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ నేతలు ప్రలోభపెడుతున్నారని, ఓటర్లను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కేటీఆర్.
KTR Complaint to EC
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని ఆక్షేపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీ అవుతోందని అంటుంటే, జూబ్లీహిల్స్‌లో మాత్రం కాంగ్రెస్ (Congress) నేతలే ఓటు చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20 వేల దొంగ ఓట్లని సృష్టించారని ఫైర్ అయ్యారు. ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కొవ్వూరి కార్తీక్ పేరుతో మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని.. దీపక్ శర్మ అనే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్.
కింది స్థాయి అధికారులు కాంగ్రెస్‌తో కుమ్మక్కై దొంగ ఓట్లను సృష్టించారని మండిపడ్డారు. దొంగ ఓట్ల పైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైన కింది స్థాయి అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు 20 వేల దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
జూబ్లీహిల్స్ బైపోల్ లో తొలిరోజు ఎంతమంది నామినేషన్లు వేశారంటే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా… 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణా పునర్ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అలాగే నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా.. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్‌తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా… తొలిరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది.
కాగా.. ఈరోజు ఉదయం ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవగా..హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈనెల 21వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం 100 మీటర్ల వరకు ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. 100 మీటర్ల వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 4 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారని చెప్పారు. నియోజవర్గ పరిధిలో 45 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని ఎన్నికల అధికారి కర్ణన్ వెల్లడించారు.
మరోవైపు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరునే బీఆర్‌ఎస్ పార్టీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎల్లుండి (ఈనెల 15) తమ అభ్యర్థి మాగంటి సునీతతో నామినేషన్ వేయించాలని బీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. మొత్తం నలుగురు సభ్యుల పేర్లను ఏఐసీసీకి పంపగా.. అందులో నవీన్ యాదవ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. ఇక జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే ఆరుగురు పేర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు ఢిల్లీకి పంపించారు. నేడు లేదా రేపు బీజేపీ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
Also Read : Indiramma Saree: ఇందిరాగాంధీ జయంతికి చీరల పంపిణీ
The post KTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
KTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు
Categories: