Maoist Party : మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మల్లోజుల బాటలో కీలక నేతలు నడిచేందుకు సిద్ధమయ్యారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. గురువారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ముందు ఆశన్న లొంగిపోనున్నారని సమాచారం. ఆయనతో పాటు మరో 70 మంది మావోయిస్టులు కూడా సీఎం ముందు జనజీవన స్రవంతిలో కలవనున్నారు.
బుధవారం ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు (Maoist Party) లొంగిపోయినట్లు ప్రకటించారు. వీరిపై రూ.50లక్షల రివార్డు ఉంది. సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్ అధికారికంగా పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఈ మేరకు మల్లోజులను పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయన ఆయుధాలు అప్పగించారు. ఈ రెండు షాకులతో మావోస్టులు అల్లాడుతుంటే… తాజాగా ఆశన్న లొంగిపోతున్నారనే వార్త.. వారికి మరో దెబ్బ తగినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Maoist Party – ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) భద్రతా దళాల నిరంతర ఆపరేషన్‌తో మావోయిస్టులు పెద్దఎత్తున లొంగిపోతున్నారు. సుక్మా జిల్లాలో బుధవారం ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో పది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిపై మొత్తం రూ.50 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు అడవి బాట వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సూచించారు. మావోయిస్టు కంచుకోట బస్తర్‌లో సైతం గడ్చిరోలి తరహ భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ఉత్తర బస్తర్ డివిజన్ ఇన్‌ఛార్జి రాజ్ మాన్ సహా పలువురు లొంగిపోనున్నట్లు సమాచారం. బస్తర్ ఐజీ సుందర్ రాజ్, కాంకేర్ ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ఈ మేరకు మావోయిస్టులతో చర్చలు జరుపుతున్నారు.
ఆయుధం వీడిన మల్లోజులకు ఆరు కోట్ల రివార్డు అందించిన సీఎం
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల మంగళవారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్ సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలు సరెండర్ చేశారు. బుధవారం ఉదయం మల్లోజులతో పాటు మరో 61 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు. ఇక, మల్లోజులపై దాదారు ఆరు కోట్ల రివార్డు ఉండటంతో(ఆరు రాష్ట్రాల్లో కోటి చొప్పున) ముఖ్యమంత్రి ఫడ్నవీస్… రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో మోస్ట్‌వాంటెడ్‌గా మల్లోజులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ..‘మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలో మావోయిజానికి చోటులేదు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తాం’ అని చెప్పుకొచ్చారు.
అయితే, మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.
Also Read : Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !
The post Maoist Party: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Maoist Party: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ !
Categories: