Giriraj Singh : తెలంగాణ రైతులు పండించే పత్తిని 100% సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ (Giriraj Singh) ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కి పెంచినట్లు వెల్లడించారు. అయితే తేమశాతాన్ని తగ్గించడానికి రైతులు పత్తిపంటను ఎండబెట్టుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల స్థాయిలోనో, కొనుగోలు కేంద్రాల స్థాయిలోనో వేదికలు ఏర్పాటుచేయాల్సి ఉన్నా ఇంతవరకూ అలాంటివేమీ చేయలేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం 100% నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల విషయమై తలెత్తుతున్న సమస్యలపై కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్‌శంకర్‌లు మంగళవారం దిల్లీలో ఆయన్ను కలిసి వివరించారు. రాష్ట్రంలో చివరి కేజీ వరకూ కొనుగోలు చేయాలని కోరారు. అందుకు సానుకూలత వ్యక్తంచేసిన కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ (Giriraj Singh) ఈ విషయంలో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూతనందించాల్సి ఉందన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) మాట్లాడుతూ… నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రైతుల ఆదాయం రెట్టింపుచేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ‘‘2014లో సాధారణ పత్తి కనీస మద్దతుధర రూ.3,700 ఉంటే ఇప్పుడు రూ.7,710కి చేరింది. పొడవుపిందె పత్తి రూ.4,000 నుంచి రూ.8,110కి పెరిగింది. 11ఏళ్లలో ఎరువుల ధరలు పెంచలేదు.. కనీస మద్దతుధరలు మాత్రం పెంచాం. ఏపీ, తెలంగాణల్లో 2014 వరకు రూ.12,500 కోట్ల వరకు మాత్రమే సేకరణ జరిగింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.73 వేల కోట్ల పత్తి సేకరిస్తున్నాం. ఒక్క తెలంగాణలోనే రూ.65 వేల కోట్ల మేర కొనుగోలు చేస్తున్నాం. తెలంగాణలో 98% పొడవుపిందె పంట సాగుచేస్తున్నారన్నారు.
తెలంగాణలో 20లక్షల మంది రైతులు 18లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేస్తున్నారు. అక్కడ ఎకరాకు 5-7 క్వింటాళ్ల దిగుబడివస్తే మహారాష్ట్రలోని వర్షాభావప్రాంతం అకోలాలో 15-18 క్వింటాళ్లదాకా వస్తోంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహకారం అందించి అధిక సాంద్రత పంటను ప్రోత్సహిస్తోంది. మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణ ప్రభుత్వమూ రైతులకు అన్నిరకాల సహకారం అందించాలి.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తితో రాష్ట్రంలోని పత్తి కొనుగోలు కేంద్రాలను పెంచాం. అయితే ట్రేడర్స్‌కి, తేమశాతం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేదికలను కల్పించాలి. గతంలో నేను గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో నరేగా నిధులు దుర్వినియోగమయ్యాయి. ఇప్పుడూ ఆ దుర్వినియోగం సాగుతోంది. వాటిని ఉపయోగించుకొని పత్తిని ఆరబెట్టే వేదికలను ఏర్పాటుచేయలేరా? మేం పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మద్దతూ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే రాష్ట్ర ప్రభుత్వ పనా’’ అని గిరిరాజ్‌సింగ్ ప్రశ్నించారు.
Minister Giriraj Singh – పత్తి రైతుల ప్రయోజనాలపై చర్చించా – కిషన్‌రెడ్డి
పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలా మేలుచేయాలన్న అంశంపై మంత్రి గిరిరాజ్‌సింగ్‌తో చర్చించినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. గతఏడాది కంటే ఈఏడాది కేంద్రాలు పెంచడానికి, చివరి కేజీ వరకూ కొనుగోలుకు కేంద్రమంత్రి అంగీకరించారని చెప్పారు. ఈ సమావేశంలో సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, జౌళిశాఖ కార్యదర్శి నీలం శమీరావు పాల్గొన్నారు.
Also Read : Ponnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలు
The post Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
Categories: