అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదని… హడావిడి నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టంచేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ దేశాల ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ పలు వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందన్నారు.
కొవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన అంతరాయాల తర్వాత 2021లో భారతదేశ వాణిజ్య విధానంలో వచ్చిన మార్పును పీయూష్ గోయల్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఒంటరిగా ఉండకూడదని ప్రపంచ దేశాలతో విశ్వసనీయ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలు ఏర్పురుచుకుంటోందని తెలిపారు. దీనివల్ల సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ విధంగా భారత్ వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉందని.. కానీ ఒత్తిడితో మాత్రం చర్చలు జరపదని స్పష్టం చేశారు.
ఇప్పటికే భారత్‌పై ఉన్న సుంకాలను అంగీకరిస్తున్నాం కదా అనే కారణంతో మరిన్ని సుంకాలను వేస్తామని బెదిరిస్తే.. ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త మార్కెట్లను వెతుక్కోవాల్సి వస్తుందని పీయూష్ గోయల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ భారత్‌పై సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఐరాస నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించవు – జై శంకర్
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించలేవని వ్యాఖ్యానించారు. ఐరాస 80వ వార్షికోత్సవం నేపథ్యంలో పోస్టల్ స్టాంపు విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వివాదాల యుగంలో శాంతి అనేది అవసరమని జై శంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తుందన్నారు. ఈక్రమంలో యూఎన్‌లో అంతా సరిగా లేదన్నారు. ఐరాసలో అర్థవంతమైన సంస్కరణలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది అత్యవసరమైనప్పటికీ.. యూఎన్‌లో మార్పులు జరిగేలా ఆ సంస్కరణలు ఉండాలన్నారు. ఐరాసకు భారత్ ఎప్పుడూ బలమైన మద్దతుదారుగానే ఉంటుందని.. అలాగే కొనసాగుతుందని తెలిపారు. కానీ.. యూఎన్ నిర్ణయాలు దాని సభ్యత్వాన్ని, ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించవని వ్యాఖ్యానించారు.
ఇటీవల మైనారిటీల రక్షణకు, భావ ప్రకటన, మీడియా స్వేచ్ఛా హక్కులు కాపాడేందుకు భారత్ సమర్థమంతమైన చర్యలు తీసుకోవాలంటూ ఐరాస మానవ హక్కుల కమిషన్ ప్రస్తుత ఛైర్మన్‌గా ఉన్న స్విట్జర్లాండ్ వ్యాఖ్యానించింది. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. ఆ దేశం జాత్యహంకారం, క్రమబద్ధమైన వివక్ష, విదేశీయులపై విద్వేషం వంటి అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ముందు వాటిని పరిష్కరించుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించింది. మరోవైపు.. పహల్గాంలో పౌరులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచవ్యాప్తంగా ఖండించినప్పటికీ.. పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. యూఎన్ సమావేశాల్లో పదేపదే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు భారత్‌పై నిందలు మోపే ప్రయత్నాలు చేస్తుంది. అయితే, భారత్ వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జై శంకర్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇక, గురువారం యూఎన్‌లో జరిగిన సమావేశాల్లో పాక్ దౌత్యవేత్తలు ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, భారత్ వీటిని తీవ్రంగా వ్యతిరేకించింది.
The post Minister Piyush Goyal: ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదు – యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం వేళ పీయూష్ గోయల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Minister Piyush Goyal: ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదు – యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం వేళ పీయూష్ గోయల్
Categories: