విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అక్కడి నేవీ అధికారుల చేతిలో బందీలు అయిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. డిల్లీలో ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాధితులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకువచ్చే చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సమస్యపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో చర్చించి పరిస్థితిని వివరించారు. బుధవారం రాత్రి ఇదే విషయంపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం తరుపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జై శంకర్ తెలియజేశారు. అలానే బంగ్లాదేశ్ లో ఉన్న ఇండియా మిషన్, మరియు కోస్ట్ గార్డ్ లతో నిరంతరం ఇదే విషయంపై ఆ సంప్రదింపులు చేస్తున్నట్టు రామ్మోహన్ నాయుడుకు పరిస్థితిని తెలియజేశారు.
కాగా విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు… ఈ నెల 13న విశాఖలోని రెల్లివీధికి చెందిన సత్యనారాయణకు చెందిన బోటును తీసుకొని చేపల వేటకు వెళ్ళారు. బుధవారం తెల్లవారుజామున వేట కొనసాగిస్తుండగా పొరపాటున బంగ్లాదేశ్ సాగర జలాల్లోకి వెళ్లినట్టు గుర్తించారు. దీంతో అక్కడి నౌకాదళ అధికారులు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనపై ఇప్పటికే దుబాయ్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం సత్వరమే స్పందించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నిరంతరం అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించడమే కాకుండా వారిని జాగ్రత్తగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతర సంప్రదింపులు, నిశిత పరిశీలన చేస్తున్నామని తెలిపారు. సముద్ర భద్రత, చట్టం, రక్షణ వ్యవహారాలు చూసే కోస్ట్ గార్డ్ వ్యవస్థతో ఈ సమస్యపై మాట్లాడామని రామ్మోహన్ నాయుడు లేఖలో వివరించారు.
మత్స్యకారులను రప్పించేందుకు ముమ్మర చర్యలు – జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
బంగ్లాదేశ్ నేవీకి చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను స్వదేశానికి క్షేమంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు వేగవంతం చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులోకి ప్రవేశించిన ఈ మత్స్యకారుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA)తో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అధికారిక చర్చలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ బి. శ్యామ్ ను సంప్రదించి కేసు పురోగతిని తెలుసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్‌లో మత్స్యకారులపై చార్జ్‌షీట్ దాఖలయిందని, అయితే ఢాకాలోని భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయబృందం వారిని రక్షించేందుకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరంతరం హైకమిషన్ మరియు బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ ఉందని చెప్పారు. బాధిత కుటుంబాలను జిల్లా పరిపాలన నిరంతరం సంప్రదిస్తూ, వారికి అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు ఆర్డీఓ డి. కీర్తి విశాఖపట్నం వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారని తెలిపారు. మత్స్యకారులను క్షేమంగా దేశానికి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ నిరంతరం కృషి చేస్తోందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు.
The post Minister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Minister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడు
Categories: