గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్‌ను అద్భుతమైన నగరం అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే, ఏపీలో గూగుల్ కంపెనీ డేటా సెంటర్ ఏర్పాటు చేయటంపై తమిళనాడులో రచ్చ మొదలైంది.
అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేల మధ్య రచ్చ జరుగుతోంది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సుందర్ పిచాయ్ తమిళ వ్యక్తి అయినప్పటికీ గూగుల్ పెట్టుబడులను ఏపీలో పెడుతున్నాడని, స్టాలిన్ సర్కార్ పెట్టుబడులు తేలేకపోయిందని ఏఐఏడీఎమ్‌కే విమర్శలు చేస్తోంది. తమిళనాడులో జరుగుతున్న ఈ రచ్చపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు.
ఆ వీడియోలో ఏఐఏడీఎంకే నాయకుడు మాట్లాడుతూ.. ‘గూగుల్ కంపెనీ ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతోంది. ఆ గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మన మధురైకి చెందిన వాడు. ప్రభుత్వం గూగుల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే మన రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేవి’ అని అన్నారు. దీనిపై అధికార పార్టీ నాయకుడు స్పందిస్తూ..‘జయ లలిత నిర్లక్ష్యం కారణంగానే చాలా కంపెనీలు ఆంధ్రాకు వెళ్లిపోయాయి’ అని అన్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే నాయకుల కామెంట్లపై నారా లోకేష్ స్పందిస్తూ.. ‘ సుందర్ పిచాయ్ ఏపీని కాదు.. భారత్‌ను పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకున్నారు’ అని స్పష్టం చేశారు.
న్యూసౌత్ వేల్స్ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలి – నారా లోకేశ్
ఏపీలో అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్‌లు, గ్రీన్ టెక్నాలజీలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ-న్యూసౌత్ వేల్స్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్‌తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఏపీ, న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని కోరారు. న్యూసౌత్ వేల్స్ ఇన్నోవేషన్ క్లస్టర్లను ఏపీలో రాబోయే ఇన్నోవేషన్, స్టార్టప్ హబ్‌లతో (విశాఖపట్నం, అమరావతి, అనంతపురం) అనుసంధానించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రెన్యూవబుల్ ఎనర్జీ, మెడిటెక్, అగ్రిటెక్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న న్యూసౌత్ వేల్స్ కంపెనీలు ఏపీ పరిశ్రమ కారిడార్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని మంత్రి కోరారు. క్లీన్ టెక్, కృత్రిమ మేధస్సు (AI), సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల మధ్య సహకారానికి ప్రోత్సాహం అందించాలని కోరారు. విశాఖపట్నంలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ -2025కి న్యూసౌత్ వేల్స్ మంత్రి నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని తమ రాష్ట్రానికి పంపించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
The post Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్
Categories: