దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ‘ఎన్‌ఐఏ’ ఉగ్రవాద సంబంధిత కేసులను దర్యాప్తు చేస్తుంది. దీన్ని బట్టి… ఈ ఘటనను కేంద్రం ఉగ్రచర్యగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తొలుత దిల్లీ పోలీసులు ఉపా చట్టం, ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండుసార్లు సమావేశం నిర్వహించి… దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. పేలుడు ఘటనపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని, సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం వెలువడింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ సైతం హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసులో మృతుల సంఖ్య 12కు పెరిగింది.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డా.ఉమర్ నబీ ఈ పేలుడులో కీలక వ్యక్తి అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నాయి. పేలుడుకు కారణమైన కారులో ఓ వ్యక్తి శరీర భాగాలను అధికారులు గుర్తించారు. ఇవి ఉమర్‌వా, కావా అని తెలుసుకునేందుకు.. డీఎన్‌ఏ నమూనాల కోసం అతడి తల్లి షమీమా బేగంను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఉమర్ నబీ ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నాడా అనేది నమ్మలేకపోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
The post NIA: ‘ఎన్‌ఐఏ’కు దిల్లీ పేలుడు కేసు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
NIA: ‘ఎన్‌ఐఏ’కు దిల్లీ పేలుడు కేసు
Categories: