Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి గోవా సముద్ర తీరంలోని ఐఎన్‌ఎస్ విక్రాంత్ లో ప్రధాని మోదీ (Narendra Modi) దీపావళి వేడుకల్లో పాల్గొని సైనికులతో సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటు కూడా మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Narendra Modi Diwali Celebrations
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ దాయాదికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు. ‘‘నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ దృశ్యం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓవైపు నాకు మహా సముద్రం.. మరోవైపు భరతమాత అందించిన ధీర జవాన్ల బలం కన్పిస్తోంది. ఈ సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు.. జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల వలే మెరుస్తున్నాయి’’ అని మోదీ కొనియాడారు.
అనంతరం ఐఎన్‌ఎస్ విక్రాంత్ సేవలను ప్రధాని కొనియాడారు. ‘‘భారత రక్షణ దళాల సామర్థ్యానికి ఈ విమాన వాహకనౌక ప్రతీక. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్.. పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టింది. శత్రుమూకల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. వారిని నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. ఈ పేరు వింటే చాలు.. పాక్‌కు నిద్ర కూడా పట్టదు’’ అని మోదీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించడం అత్యవసరం అని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధమని తెలిపారు.
2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. సైనిక దుస్తులు ధరించి.. దళాలతో ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2018లో దీపావళి రోజున ఉత్తరాఖండ్‌లోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో ముచ్చటించారు. 2022లో కార్గిల్‌లో, 2023లో చైనా సరిహద్దులోని లేప్చా (హిమాచల్‌ప్రదేశ్) సైనిక శిబిరంలో వేడుకలు చేసుకున్నారు. ఇక, గతేడాది కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందిని కలిసి వారితో వేడుకలు చేసుకున్నారు.
Narendra Modi – ప్రస్తుతం 3 జిల్లాల్లోనే మావోయిస్టుల ఉనికి – ప్రధాని మోదీ
ఉగ్రవాదం, మావోయిస్టులకు భారత్ లో చోటు లేదని ప్రధాని మోదీ (Narendra Modi) అన్నారు. మావోయిస్టు రహిత దేశం దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. వారి ఏరివేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాది మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన 100కి పైగా జిల్లాలు ఆనందంగా దీపావళి వేడుకలు నిర్వహించుకుంటాయని పేర్కొన్నారు.గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో ప్రధాని దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రతా దళాల స్థైర్యాన్ని ప్రశంసించారు.
‘‘మావోయిస్టులు.. అభివృద్ధి నిరోధకులుగా మారారు. వారి ఏరివేతకే ఆపరేషన్ కగార్ చేపట్టాం. భద్రతా దళాల ధైర్యం కారణంగానే దేశం మరో ప్రధాన మైలురాయిని సాధించింది. 11 ఏళ్లక్రితం నక్సల్స్ 125 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమయ్యారు. మావోయిస్టుల రహితంగా దేశాన్ని మార్చడమే మా లక్ష్యం. 100కు పైగా జిల్లాల ప్రజలు మావోయిస్టుల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నారు. వేల మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు’’ అని మోదీ తెలిపారు.
‘‘గతంలో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు కనీస సౌకర్యాలు లేని దుస్థితిని తీసుకువచ్చారు. పాఠశాలలు, ఆసుపత్రులను పేల్చివేసి, వైద్యులను కాల్చి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కొత్త పాఠశాలలు, ఆస్పత్రులతో చిన్నారులు నూతన భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఈ విజయం మొత్తం భద్రతా దళాలదే. దేశంలోని అనేక జిల్లాల్లో ప్రజలు తొలిసారిగా దీపావళిని గర్వంగా, గౌరవంగా నిర్వహించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా’’ అని మోదీ పేర్కొన్నారు.
మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలసిందే. ఇందులో భాగంగా దండకారణ్యాల్లో జరిపిన ఎన్‌కౌంటర్లలో అగ్రనాయకుల నుంచి అనేక మంది మావోయిస్టులు మరణించారు. ఈ పరిణామాలతో చాలా మంది ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరుతున్నారు.
Also Read : Indian Navy: ఆపరేషన్ సిందూర్‌పై నేవీ ‘కసమ్ సిందూర్‌కి’ పాట
The post PM Narendra Modi: ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
PM Narendra Modi: ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
Categories: