పెద్దసంఖ్యలో పుణ్యక్షేత్రాలున్న ఉత్తరాఖండ్‌కు అసలైన బలం ఆధ్యాత్మిక శక్తి అని, ఈ రాష్ట్రం సంకల్పిస్తే రాబోయే అయిదేళ్లలో ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా అవతరించగలదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆవిర్భవించిన పాతికేళ్లలో అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. ఆదివారం దేహ్రాదూన్‌లో నిర్వహించిన ఉత్తరాఖండ్ రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. రూ.8,260 కోట్ల వ్యయమయ్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక్కడి ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన, యోగ కేంద్రాలను ప్రపంచంతో అనుసంధానిస్తే మరింతగా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
జనాభా కూర్పులో మార్పులు రాకుండా చూడటం, ఉమ్మడి పౌరస్మృతి అమలు, మతమార్పిళ్లను అడ్డుకోవడం వంటివి ధైర్యంగా అమలుచేసిన ఉత్తరాఖండ్ తీరును ఇతర రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సున్నిత అంశాలపైనా పుష్కర్‌సింగ్ ధామీ సర్కారు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోందని ప్రశంసించారు. ‘‘దేశవిదేశాల ప్రజలు ఆరోగ్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఔషధ మూలికలు, ఆయుర్వేద ఔషధాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గత పాతికేళ్లలో ఆరోగ్య పర్యాటకంలో ఉత్తరాఖండ్ అద్భుత ప్రగతి సాధించింది. ఉత్తరాఖండ్ అంటే దేశ ఆధ్యాత్మిక జీవితానికి గుండె చప్పుడు’’ అని చెప్పారు.
సభకు హాజరైతే అదనపు మార్కులు – ఖండించిన కేంద్రం
మోదీ సభకు హాజరైన విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 అంతర్గత మార్కులు వేస్తామని ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం ఓ నోటీసులో తెలిపినట్లు వచ్చిన వార్తల్ని కేంద్రం ఖండించింది. ఇలాంటిదేమీ జారీ కాలేదని పీఐబీ నిజనిర్ధారణ విభాగం స్పష్టంచేసింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వెల్లడించారు.
The post PM Narendra Modi: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్ – ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
PM Narendra Modi: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్ – ప్రధాని మోదీ
Categories: