భూటాన్ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీ
భూటాన్ సర్వతోముఖాభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భూటాన్ 13వ పంచవర్ష(2024–2029) ప్రణాళికకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోదీ భూటాన్ పర్యటన రెండో రోజు బుధవారం కూడా కొనసాగింది. మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌తో ఆయన సమావేశమయ్యారు. భారత్, భూటాన్ సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఇంధనం, వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, అనుసంధానం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు.
ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. భారత్–భూటాన్ సంబంధాల బలోపేతానికి జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ ఎంతగానో కృషి చేశారని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ(తూర్పునకు ప్రాధాన్యం)లో భాగంగా భూటాన్‌లో చేపట్టిన గెలెఫూ మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్టులో ప్రగతి పట్ల మోదీ సంతోషం వ్యక్తంచేశారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళిక అమలుకు రూ.10,000 కోట్ల సాయం అందిస్తామని భారత్ ఇప్పటికే హామీ ఇచ్చింది.
భూటాన్ కాలచక్ర వేడుకలో మోదీ
భూటాన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రార్థన పండుగలో భాగంగా కాలచక్ర ఎంపవర్‌మెంట్ వేడుకను ప్రధాని మోదీ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో కలిసి కాలచక్ర ‘వీల్ ఆఫ్ టైమ్ ఎంపవర్‌మెంట్’ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఇదొక గొప్ప వేడుక అని తెలిపారు.
కాలచక్రకు బౌద్ధమతంలో అత్యున్నత సాంస్కృతిక ప్రాధాన్యం ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి పండితులు, గురువులు, భక్తులు హాజరయ్యారని వెల్లడించారు. భారత ప్రధాని మోదీ ‘అనుకున్నది సాధించిన ఆధ్యాతి్మక గురువు’ అని భూటాన్ ప్రధానమంత్రి త్సెరింగ్ టాబ్గే అభివరి్ణంచారు. మోదీ బుధవారం భూటాన్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. తన పర్యటనతో భారత్–భూటాన్ మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వేగం మరింత పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.
కాలచక్ర అంటే ఏమిటంటే ?
ఇదొక ఆధ్యాత్మిక వేడుక. బౌద్ధులు పరమ పవిత్రంగా భావిస్తారు. భగవంతుడి ఆశీస్సుల కోసం కాలచక్ర నిర్వహిస్తారు. గౌతమబుద్ధుడి మార్గంలో నడస్తూ జ్ఞానోదయం పొందడానికి ప్రార్థనలు, ధ్యానం నిర్వహిస్తారు. మత గురువుల బోధనలు ఉంటాయి. భూటాన్ ప్రభుత్వం అధికారికంగా కాలచక్ర ఎంపవర్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
The post PM Narendra Modi: భూటాన్ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
PM Narendra Modi: భూటాన్ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీ
Categories: