వందేమాతరం గేయం… దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోదీ.. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు, ప్రత్యేక నాణెం విడుదల చేశారు. ఏడాది పొడవునా జరిగే ‘వందేమాతరం’ సంబరాలనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘వందేమాతరం గేయం కాదు.. భారతీయులు సాధించలేని లక్ష్యమంటూ ఏదీ లేదని చెప్పే ధైర్యం. ఓ మంత్రం, స్వప్నం, సంకల్పం. ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తున్న గేయం. ఉగ్రవాదం ఆయుధంగా మన దేశంపై శత్రువు దాడి చేసినపుడు.. దేశం దుర్గామాత అవతారమెత్తడాన్ని ప్రపంచం చూసింది’’ అని అన్నారు.
విభజనవాదులతో దేశానికి ముప్పు
ఈ సందర్భంగా ప్రధాని మోదీ… కాంగ్రెస్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. 1875లో బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గేయంలోని ముఖ్యమైన చరణాలను 1937లో తొలగించారని, దీంతోనే దేశ విభజనకు బీజాలు పడ్డాయని వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల గొంతుక వందేమాతరం. ప్రతి భారతీయుడి భావోద్వేగాలను ప్రతిబింబించిన గీతం. దురదృష్టవశాత్తూ 1937లో ఆత్మ నుంచి ఒక భాగాన్ని వేరు చేసినట్లు, ఈ గేయంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారు. వందేమాతరాన్ని ముక్కలు చేశారు. ఈ విభజనతో దేశ విభజనకూ బీజాలు పడ్డాయి. ఈ గేయానికి ఎందుకు అన్యాయం జరిగిందో యువతరం తెలుసుకోవాలి. ఆ విభజనవాద మనస్తత్వంతో ఇప్పటికీ దేశానికి ముప్పు పొంచి ఉంది’’ అని పేర్కొన్నారు.
వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘వందేమాతరం’ దేశ ప్రజల భావోద్వేగ చైతన్యానికి, సమైక్యతకు ప్రతీకగా నిలుస్తూనే ఉందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో వందేమాతర గేయం కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహాం
ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనల మేరకే 1937లో వందేమాతరం గేయంలోని తొలి రెండు చరణాలను అప్పటి కాంగ్రెస్ ఎంపిక చేసిందని గుర్తుచేసింది. నోబెల్ అవార్డు గ్రహీత అయిన ఠాగూర్‌ను ప్రధాని విభజనవాదిగా పేర్కొనడం సిగ్గుచేటని విమర్శించింది. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ‘‘1937లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ముందు ఈ అంశంపై నెహ్రూకు ఠాగూర్ లేఖ రాశారు. ఆరు చరణాల్లో తొలి రెండు చరణాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆ మేరకు అప్పటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది’’ అని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. దేశ సామూహిక ఆత్మను మేల్కొల్పిన వందేమాతరం గేయానికి పతాకధారిగా కాంగ్రెస్ పనిచేసిందని, ఇందుకు గర్వంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. జాతీయవాదులమని చెప్పుకొనే ఆరెస్సెస్, బీజేపీ వారు తమ శాఖల్లో, కార్యాలయాల్లో గానీ.. ఎన్నడూ వందేమాతరం, ‘జన గణ మన’ పాడలేదని ఆరోపించింది.
The post PM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
PM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీ
Categories: