పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని… సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా… ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పుకొచ్చారు. బుధవారం సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారక నాణం విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయని కొనియాడారు.
ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని అన్నారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తుచేశారు. అందరినీ ప్రేమించాలి.. అందరికీ సేవ చేయాలి.. ఇదే బాబా నినాదమని వివరించారు. గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు బాబా సేవాదళ్ సేవలందించిందని గుర్తుచేశారు. పేదలకు ఎప్పుడు ఆపద వచ్చినా.. బాబా సేవాదళ్ ఆదుకుంటుందని ప్రశంసించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారనిపేర్కొన్నారు.
అది నాకు గోల్డెన్ మూమెంట్ – సచిన్
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లొ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరై మాట్లాడారు. సత్యసాయి బాబాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సత్యసాయి తనకి ఓ పుస్తకం పంపారని.. అదే జీవితంలో గోల్డెన్ మూమెంట్ అని చెప్పుకొచ్చారు. ‘ప్రజలను జడ్జ్ చేయొద్దు.. వారిని అర్థం చేసుకోవాలి అని సత్యాసాయి నాకు చెప్పారు. దీని వల్ల చాలా సమస్యలు మన దరికి రావని సూచించారు. 2011 ప్రపంచ కప్‌లో నేను ఆడుతున్నప్పుడు నా మది నిండా ఎన్నో భావోద్వేగాలు ఉండేవి. ఎందుకంటే అదే నా చివరి వరల్డ్ కప్. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా. ఆ సమయంలో బాబా పంపిన ఓ పుస్తకం నా దగ్గరికి వచ్చింది. ఆ వెంటనే నా ముఖంలో తెలియని ఆనందం. నా జీవితంలో అదే నాకు గోల్డెన్ మూమెంట్ అనిపించింది’ అని సచిన్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
అదే నాకు ధైర్యాన్నిచ్చింది
‘బాబా పంపిన పుస్తకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ప్రాక్టీస్ నుంచి మ్యాచ్‌లు ఆడే వరకు.. ఆ పుస్తకమే నా తోడుంది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ముంబైలో శ్రీలంకపై ఘన విజయం సాధించాం. సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడాం. దేశమంతా ఆనందంలో మునిగిపోయింది. నా ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్‌లో అదే గొప్పగా అనిపించింది. దీనికి కారణం బాబా ఆశీస్సులు, గురువుల దీవెనలే. భగవాన్ సత్యసాయి బాబా అనుగ్రహమే దీనికి ముఖ్య కారణం’ అని సచిన్ వెల్లడించారు.
భూమిపై మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి – సీఎం చంద్రబాబు
విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భూమిపై మనకు తెలిసిన.. మనం చూసిన దైవస్వరూపం ఆయనని కొనియాడారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్, పలువురుమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘మానవసేవే మాధవసేవ అని సత్యసాయి నమ్మి ఆచరించారు. ప్రపంచమంతా ప్రేమను పంచారు. విదేశాలకు వెళ్తే చాలా మంది ఆయన గురించి చెప్పేవారు. 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 102 విద్యాలయాలు నెలకొల్పారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించారు. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోంది. ట్రస్ట్‌కు 7లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి. సత్యసాయి చూపిన మార్గంలో ముందుకెళ్లాలి’’ అని చంద్రబాబు అన్నారు.
అరుదైన ఆధ్యాత్మిక శక్తి – పవన్‌కల్యాణ్
ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన, ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. విదేశాల్లో చాలా మంది సత్యసాయి భక్తులను చూశానన్నారు. ‘‘సామాన్యుడికి తాగునీరు అందివ్వాలని సత్యసాయి ఆలోచించారు. జల్‌జీవన్ మిషన్ తరహాలో ఏర్పాట్లు చేశారు. అలాంటి సేవా తత్పరత ఆయనది. సచిన్ తెందూల్కర్‌తో పాటు ఎంతో మంది ప్రముఖులను ఆయన ప్రభావితం చేశారు. వారిలో ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తాం’’ అని పవన్ తెలిపారు.
The post PM Narendra Modi: సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయి – ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
PM Narendra Modi: సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయి – ప్రధాని మోదీ
Categories: