బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అటు ఎన్డీయే.. ఇటు ఇండియా బ్లాక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామం అందుకు వేదికైంది. బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్ కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను కలిశారు. ఈ సందర్భంగా రోజ్‌గార్‌మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘వచ్చే నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలుకొడుతుందని ప్రధాని మోదీ అన్నారు. యువతకు సాధికారత కల్పించడమే మా కూటమి ప్రాధాన్యం. ఫెస్టివల్ సీజన్‌లో ఆఫర్ లెటర్స్ అందుకోవడం వేడుకలను రెట్టింపు చేస్తుంది. ఈ రోజు 51 వేల మంది యువత ఆ ఆనందాన్ని పొందుతున్నారు. అది నాకు ఆనందాన్నిస్తోంది. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన వారికి కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు. “ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్… ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్” అని బిహార్ ప్రజలు అంటున్నారన్నారు.
నితీశ్ కుమార్‌ను ‘సుశాసన్ బాబు’ అనే ప్రజాదరణ పొందిన బిరుదు పేరుతో మోదీ ప్రస్తావించారు. మొదటిసారి నితీశ్ కుమార్‌ను ఎన్డీయే ప్రచార ముఖంగా ప్రస్తావించారు. అయితే, ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడా కూడా సీఎం అభ్యర్థి అనే మాట ప్రస్తావించకుండానే.. ఈసారి కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ తేజస్వి సవాల్‌పై ప్రధాని మోదీ స్పందించినట్లయింది. కాగా, బీజేపీ.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో వెనుకడుగు వేస్తోందంటూ మహాఘట్‌బంధన్ విమర్శించింది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందంటూ తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి?’’ అంటూ తేజస్వీ ధ్వజమెత్తారు.
బిహార్ రాజకీయాల్లో కులం కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలోనూ కుల సమీకరణాలదే ముఖ్య భూమిక. ఈ పరిస్థితిని మార్చేందుకు కొన్ని దశాబ్దాల క్రితమే పోరాడిన నేత కర్పూరీ ఠాకూర్. తన ఊరు పితౌంఝియాలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. అట్టడుగున ఉన్నవారిని రాజకీయంగా చైతన్య పరిచారు. ముఖ్యమంత్రి స్థాయికి చేరినా పూరి గుడిసెలోనే ఉండేవారు. బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. గతేడాది ఆయన శత జయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న (Bharat Ratna)తో గౌరవించింది.
మోదీ వ్యాఖ్యలకు తేజస్వి యాదవ్ కౌంటర్
బిహార్‌లో ఆర్జేడీ ‘జంగల్ రాజ్’ (ఆటవిక పాలన)పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. దానిపై తాజాగా మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ స్పందించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే… అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బిహార్ రాజధాని పట్నాలో మాట్లాడారు.
‘‘నీతీశ్ కుమార్ ప్రభుత్వం పాల్పడిన 55 కుంభకోణాల గురించి ప్రధాని మోదీనే వెల్లడించారు. ఆ అవినీతిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు..? మోసాలు జరుగుతున్నప్పుడు, ఎలాంటి చర్యలు లేనప్పుడు దానిని జంగల్ రాజ్ అంటారు. నేరాల రేటులో భాజపా పాలిత రాష్ట్రాలే ముందువరుసలో ఉన్నాయి. అక్కడ వారు ఏం చేస్తున్నారు..?’’ అని తేజస్వి ప్రశ్నించారు. మహాగఠ్‌బంధన్ ఈ నిరుపయోగమైన డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కూలదోస్తుందన్నారు. ఒక ఇంజిన్ అవినీతిమయమైందని, మరో ఇంజిన్ నేరపూరితమైందని దుయ్యబట్టారు.
ఆర్జేడీ తేజస్వి వ్యాఖ్యల వేళ.. బీజేపీ స్పందించింది. ఆయన్ను అవినీతిపరుడని కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ అభివర్ణించారు. ‘‘అవినీతికి పర్యాయపదంగా మారిన వ్యక్తి దాని గురించి మాట్లాడుతుంటే షాకింగ్‌గా ఉంది. అపారమైన సంపదను కూడబెట్టుకున్న ఈ కుటుంబం వల్ల బిహార్ వెనక్కి వెళ్లిపోయింది’’ అని వ్యాఖ్యలు చేశారు. యాదవ్ కుటుంబసభ్యులు పలు కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విమర్శలు చేశారు. దీనికిముందు బిహార్ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నేతలకు తమలో తాము ఎలా పోట్లాడాలో, స్వప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో మాత్రమే తెలుసు. బిహార్‌ను ఆటవిక రాజ్యం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సీఎం నీతీశ్‌కుమార్, ఎన్డీయే నేతలు ఎంతో కృషి చేశారు’’ అని ధ్వజమెత్తారు.
The post PM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
PM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
Categories: