ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిశోర్… సొంత రాష్ట్రమైన బిహార్ లో మాత్రం చతికిల పడ్డారు. పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగిన తొలి ప్రయత్నంలోనే ఘోర పరాభావాన్ని చవిచూశారు. ‘చాయ్ పే చర్చా, కాఫీ విత్ కెప్టెన్’ వంటి నినాదాలు, సర్వేలు, సోషల్ మీడియా ప్రచార వ్యూహాలతో అనేక పార్టీలను అధికార పీఠమెక్కించడంలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు… స్వరాష్ట్రంలో మాత్రం సొంత నినాదం పని చేయలేదు. వలసలు, నిరుద్యోగం, అభివృద్ధిలో వెనకబడిపోయిన రాష్ట్రంలో… రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానని హామీ ఇచ్చే ప్రయత్నం చేసినా బిహారీలు కన్నెత్తి కూడా చూడలేదు. రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసినా బోణీ కొట్టని జన్‌సురాజ్ పార్టీ(జేఎస్పీ) అనేక చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది. ‘‘గెలిస్తే మహా ప్రభంజనం సృష్టిస్తాం. ఎవ్వరూ ఊహించనన్ని సీట్లు గెల్చుకుంటా. లేదంటే అత్యంత ఘోరంగా ఓడిపోతాం’’అని ఎన్నిలకు ముందు చెప్పిన ఆయ మాటలు నిజమయ్యాయి.
ఎంతో మంది విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్
రాజకీయ వ్యూహకర్తగా అవతారమెత్తిన ప్రశాంత్ కిశోర్… కొన్నేళ్ల క్రితం ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. డేటా విశ్లేషణ ఆధారిత విధానాలు, బూత్‌స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి సరికొత్త అస్త్రాలతో పలు పార్టీల విజయంలో కీలకంగా వ్యవహరించారు. చాయ్ పే చర్చా, అబ్ కీ బార్ మోదీ సర్కార్ వంటి నినాదాలతో 2014లో మోదీ ప్రచారాలను కొత్త పుంతలు తొక్కించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగికి రోడ్ షోలు, బిహార్‌లో ‘నీతీశ్ నాయక్’, పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌కు ‘కాఫీ విత్ కెప్టెన్’ ఏపీలో జగన్ ‘నవరత్నాలు’, కేజ్రీవాల్‌కు ‘ఉచిత’ సలహాలు, బెంగాల్‌లో దీదీకి ‘బంగ్లా నిజేర్ మేయేకే చాయ్’, స్టాలిన్‌కు సలహాలు అందించారు. వినూత్న విధానాలతో దాదాపు అందర్నీ గట్టెక్కించిన పీకే.. సొంత రాష్ట్రంలో మాత్రం చతికిలపడ్డారు.
జనాదరణ ఉన్న నేతలు లేకపోవడం, సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉండటం, కొన్నిచోట్ల క్యాడర్ తిరుగుబాటు, చివరి క్షణంలో నేతలు పార్టీలు మారడం వంటివి జన్ సురాజ్‌కు ప్రతికూలంగా మారాయి. ప్రధాన పార్టీలు పీకే పార్టీని ప్రత్యర్థుల బీ-టీమ్‌గా ప్రచారం చేశాయి. పోటీకి దూరంగా ఉండి పార్టీ బలోపేతం పైనే ప్రశాంత్ దృష్టిపెట్టారు. పోలింగ్‌కు ముందే ఫలితాలను అంచనా వేసిన ఆయన.. వస్తే 150, లేదంటే పది సీట్లు వస్తాయని ముందుగానే చెప్పారు. గతంలో ప్రధాని మోదీ, నీతీశ్ కుమార్‌ల విజయానికి కృషి చేసి ఓటమి ఎరుగని కన్సల్టెంటుగా పేరు తెచ్చుకున్న ఆయన.. వారి వ్యూహాల ముందు గెలవలేకపోయారు.
పాదయాత్రలు చేసినా దక్కని ఫలితం
రెండు, మూడేళ్ల క్రితం నుంచే బిహార్‌పై దృష్టిసారించిన పీకే… ‘బిహార్ బద్లావ్’ పేరుతో 2022లో పాదయాత్ర చేపట్టారు. వందల కిలోమీటర్లు ఇంటింటికీ తిరిగారు. బిహార్ రూపురేఖలను మార్చే ప్రయత్నం చేస్తానని చెప్పిన ఆయన జన్‌సురాజ్ పార్టీని స్థాపించారు. సామాజిక వేత్తలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. రాజకీయ నేపథ్యం లేని కొత్త ముఖాలను పరిచయం చేశారు. ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, వలసల కట్టడిపై వాగ్దానాలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి.. వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కోసం ఖర్చుపెడతానన్నారు. ఆయన సభలకు, రోడ్‌షోలకు భారీస్థాయిలో హాజరైనప్పటికీ వాటిని ఓట్లుగా మార్చడంలో వెనకబడ్డారు.
The post Prashant Kishor: స్వరాష్ట్రంలో చతికిలపడిన చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Prashant Kishor: స్వరాష్ట్రంలో చతికిలపడిన చాణక్యుడు ప్రశాంత్ కిశోర్
Categories: