బిహార్ ఎన్నికల వేళ ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ కింద మహిళలకు రూ.10 వేల చొప్పున నితీశ్ కుమార్ ప్రభుత్వం జరిపిన పంపకాలపై ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్‌పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రపంచబ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం నుంచి ఈ మొత్తాన్ని పంచారని, ఇది రూ.14,000 కోట్లకు సమానమని పేర్కొంది. పార్టీ జాతీయాధ్యక్షుడు ఉదయ్‌సింగ్ విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని డబ్బులిచ్చి కొనుగోలు చేశారు. జూన్ 21వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమయ్యే తేదీ వరకూ దాదాపు రూ.14 వేల కోట్లు పంచిపెట్టారు. ప్రభుత్వధనం ఖర్చు చేసి ఓట్లు కొన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి ఈ డబ్బులు తీసుకున్నట్లు సమాచారం ఉంది’ అని తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
జన్‌సురాజ్‌పార్టీ అధికారప్రతినిధి పవన్‌వర్మ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ.. వేరే ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు నుంచి తీసుకున్న రూ.21 వేల కోట్ల నుంచి ఒక కోటీ 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల చొప్పున పంచారని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావటానికి కేవలం గంట ముందు ఈ తాయిలాల పంపిణీ మొదలైందని ఆరోపించారు. మొత్తంగా రూ.14 వేల కోట్లు పంచిపెట్టారని, ఖజానా ఖాళీ అయిపోయినట్లు తెలిసిందన్నారు.
బిహార్ సీఎంగా నితీశ్ ?
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే కొనసాగుతారా? మరోసారి ఆయనే సీఎంగా బాధ్యతలు చేపడతారా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ నెల 19 లేదా 20న బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని చెబుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో బిహార్ మంత్రివర్గ ఫార్ములాను ఖరారు చేసినట్లు సమాచారం. నితీశ్‌నే సీఎంగా కొనసాగించాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో సింహభాగం పదవులు బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది. 15-16 పదవులు కాషాయ పార్టీకి, 14 పదవులు జేడీయూకు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీకి మూడు, మరో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝి పార్టీ హిందుస్థానీ అవామ్ మోర్చా(హెచ్‌ఏఎం)కు ఒకటి, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కు ఒకటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇదీ ప్రక్రియ
బిహార్‌లో 18వ అసెంబ్లీ ఏర్పాటుకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు వివరిస్తారు. సోమవారం నితీశ్‌కుమార్ క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారు. 17వ శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం ఆమోదిస్తారు. అనంతరం ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పిస్తారు. కూటమి నేతలు సమావేశమై ఎన్డీయే శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. బుధ లేదా గురువారం సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ షెడ్యూల్‌ను బట్టి ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేయనున్నారు. నితీశ్ పదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేయనుండడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్నారు.
The post Prashant Kishore: ప్రపంచబ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు – ప్రశాంత్ కిశోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Prashant Kishore: ప్రపంచబ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు – ప్రశాంత్ కిశోర్
Categories: