ఓట్ల చోరీ అంశంపై బీజేపీ, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో పెద్ద మొత్తం(టోకుగా)లో ఓట్లను చోరీ చేసే పనిలో బీజేపీ నిమగ్నమైందని, ఈ విధంగానే మోదీ ప్రధాని అయ్యారని ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఓట్ల చోరీపై మా దగ్గర చాలా సమాచారం ఉంది. ఈ విషయంలో మేం విశ్లేషణలు కొనసాగిస్తున్నాం. హరియాణా ఎన్నికల్లో ఓట్ల చోరీపై ఇటీవల నేను ప్రజంటేషన్ ఇచ్చాను. అందులో నకిలీ ఓట్లు, నకిలీ ఫొటోలను బయటపెట్టాను. కానీ, ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి సమాధానం లేదు. బీజేపీ మాత్రం ఈసీని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది.
దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓట్లను బీజేపీ ఎలా దొంగలిస్తుందనే విషయాన్ని యువత, జెన్-జడ్‌కి కాంగ్రెస్ స్పష్టంగా వివరిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో భాజపా ఇలానే ఓట్ల చోరీ చేసింది’’ అని రాహుల్ ఆరోపించారు. దీన్ని బీజేపీ ఖండించింది. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈసీపై రాహుల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది.
దిల్లీలో ఓటేసిన బీజేపీ నేతలు బిహార్ లోనూ వేశారు
దిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ నేతలు బిహార్ తొలివిడత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు వేశారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. బిహార్‌లోని బాంకా జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. హరియాణాలోని 2 కోట్ల ఓటర్లలో 29 లక్షలు నకిలీవని పునరుద్ఘాటించారు. ఇదే తరహాలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ చేశారన్నారు. ప్రస్తుతం బిహార్‌లో ఓట్ల చోరీకి యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇది ‘నరేంద్ర-నీతీశ్’పై ప్రజల నమ్మకానికి నిదర్శనం – ప్రధాని మోదీ
బిహార్‌లో తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవడం నరేంద్ర-నీతీశ్ ట్రాక్ రికార్డుల పట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని ప్రధానమంత్రి మోదీ అన్నారు. సీఎం నీతీశ్ కుమార్ నేతృత్వంలోనే బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహాగఠ్‌బంధన్‌కు ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని ఔరంగాబాద్, భభువాలో నిర్వహించిన సభల్లో పాల్గొన్న ప్రధాని.. 121 నియోజక వర్గాల్లో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని(ఈసీ) అభినందించారు.
రూ.లక్ష కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా వారికి తెలియదు
ఆర్జేడీ నేతలకు రూ.లక్ష కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదని మోదీ ఎద్దేవా చేశారు. ‘నేను హామీ ఇచ్చిన పనులన్నీ పూర్తి చేస్తాను. 500 ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్న అయోధ్యలో ఈరోజు రామమందిర నిర్మాణం పూర్తి అయ్యింది. ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఈ 11 ఏళ్లలో సైనిక కుటుంబాలకు వన్ ర్యాంక్ వన్ పింఛన్ ద్వారా రూ.లక్ష కోట్లు ఇచ్చాం. ఆర్జేడీ నేతలకు అందులో ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా అర్థంకాదు. కానీ కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చామని అసత్యాలు చెబుతున్నారు’ అని ప్రధాని విమర్శించారు.
The post Rahul Gandhi: ఓట్ల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు – రాహుల్‌గాంధీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Rahul Gandhi: ఓట్ల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు – రాహుల్‌గాంధీ
Categories: