Ramachandra Yadav : నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారుల వద్దకు వెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ను (Ramachandra Yadav) పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయరదారిని మత్స్యకారులు దిగ్బంధించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ ఆందోళనకు దిగారు. బల్క్ డ్రగ్స్ పార్క్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులు చేపట్టిన ఆందోళనతో ఇప్పటికే జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
అనకాపల్లి (Anakapalli) జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ తమకు వద్దంటూ గత నెల రోజులుగా రాజయ్యపేట మత్స్యకారులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. బల్క్ డ్రగ్ పార్క్‌తో కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని, అలాంటి పరిశ్రమ తమకు వద్దని ప్రభావిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ బాధిత మత్స్యకారులకు మద్దతు తెలపడానికి విశాఖలో మారియట్ హోటల్ బస చేసారు. అయితే రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) ఉన్న మారియట్ హోటల్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వద్దకు వెళ్లకుండా విశాఖలోనే అడ్డుకున్నారు.
Ramachandra Yadav Key Commeta
ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టిడిపి (TD), వైసిపి తప్ప మరే పార్టీలు ఉండకుండా పోలీసులు ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకున్నారా? అని ప్రశ్నించారు. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నారు. కరేడు పర్యటనకు ఏ అనుమతులు ఇచ్చారో అదే అనుమతులు నక్కపల్లి పర్యటనకు కూడా ఇవ్వాలని, ఈనెల 10వ తేదీ లోగా నిర్ణయాన్ని తెలియజేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. కానీ పోలీసులు మాత్రం 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తన వాట్సాప్ కు అనుమతులు ఇవ్వలేమంటూ నోటీసులు పంపారన్నారు. పుంగనూరులోని తన నివాసానికి నోటీసులు అతికించారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఢిల్లీలో ఉన్న తన వద్దకు పోలీసులు వచ్చారని, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నక్కపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. తన పర్యటనకు అనుమతులు ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మత్స్యకారులకు మద్దతుగా నిలిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్పడం సిగ్గుచేటన్నారు.
రాజయ్యపేటలో పర్యటించేందుకు అనుమతులు ఇవ్వకపోవడానికి తనపై ఉన్న కేసులే కారణమని పోలీసులు చెప్పడం సిగ్గుచేటని రామచంద్రయాదవ్ పోలీసుల తీరును దుయ్యబట్టారు. తనపై 13 క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందుకే అనుమతులు ఇవ్వడం లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారన్నారు. తనపై ఉన్నది 13 కేసులు కాదని, దాదాపు 28 కేసులు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలోనూ, అసెంబ్లీలోనూ తనపై పెట్టిన కేసులు తప్పుడు కేసులని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిండుసభలోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పినా కూడా… పోలీసులు అవే తప్పుడు కేసులు చూపించి తనకు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ కు అనుమతులు ఎలా ఇచ్చారు – రామచంద్రయాదవ్
తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అనుమతులు ఇవ్వని పోలీసులు.. రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ఎలా అనుమతులు ఇచ్చారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో అందరికీ తెలుసన్నారు. ఆయనపై కేసులు లేవా? అని ప్రశ్నించారు. తాను పర్యటించాల్సిన ప్రాంతానికి చెందిన డివిజన్ లోనే జగన్ మోహన్ రెడ్డి ఆర్భాటంగా పర్యటించారని, పోలీసులు ఆయనకు ఎలా అనుమతులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపి రెండు పార్టీలే ఉండాలని పోలీసులు ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తున్నారా? అని దుయ్యబట్టారు.
Also Read : Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్
The post Ramachandra Yadav: బల్క్ డ్రగ్స్ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Ramachandra Yadav: బల్క్ డ్రగ్స్ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులు
Categories: