hyderabadupdates.com movies RRR కేసు: ఇక సునీల్‌కుమార్ వంతు

RRR కేసు: ఇక సునీల్‌కుమార్ వంతు

ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఘటనలో తాజా గా కీలక అడుగులు పడ్డాయి. ప్రభుత్వం వివరాల దిశగా చర్యలు వేగవంతం చేసింది. దీంతో రఘురామ కొన్నాళ్లుగా ఎదుర్కొన్న ఆవేదన నుంచి ఒకింత ఊరట లభించినట్టు అయింది. ఏపీలో వైసీపీ సర్కారు పాలన సమయంలో సీఐడీ డీజీగా పనిచేసిన సునీల్ కుమార్ కు తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 4న విచారణ కు రావాలని ఆదేశించింది.

ఏం జరిగింది?

వైసీపీ హయాంలో ప్రభుత్వ లోపాలను, సీఎం జగన్ వ్యవహార శైలిని అదే పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ రఘురామ తరచుగా విమర్శించేవారు. అయితే దీనిపై మార్పు అవసరం ఉన్నా వైసీపీ అధినేత రఘురామ పై అక్కసు పెంచుకున్నారు. ప్రజాస్వామ్యం అంటేనే విమర్శకు స్థానం ఉంటుంది. దాని నుంచి పాలకులు తమను తాము సరిదిద్దుకునే అవకాశం పొందాలి. కానీ ఈ విషయంలో మొండిగా వ్యవహరించిన జగన్ ప్రభుత్వం సొంత ఎంపీ పైనే దేశద్రోహం కేసు పెట్టింది.

ఈ నేపథ్యంలో రఘురామను అరెస్టు చేసే బాధ్యతను అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు అప్పగించారు. దీంతో రఘురామను ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్ లో బలవంతంగా అరెస్టు చేయడంతో పాటు విజయవాడ కు తరలించారు. అదే రోజు రాత్రి గుంటూరులోని ఒక పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి హింసించారన్నది రఘురామ చేసిన ఆరోపణ. దీనిపై కోర్టులో కూడా కేసు దాఖలు చేశారు. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైదరాబాదులోని ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలకు పంపించింది. నివేదికను కూడా సమర్పింపజేసింది.

ఇక తనను హింసించారంటూ రఘురామ చేసిన ఫిర్యాదు పై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా విజయనగరం ఎస్పీ దామోదర్ వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో ఏ1 గా అప్పటి సీఐడీ చీఫ్ ప్రస్తుతం బీహార్ లో పనిచేస్తున్న సునీల్ కుమార్ ను పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులను విచారించినా రఘురామ మాత్రం సీఐడీ చీఫ్ సునీల్ విచారణ కోసం ఎదురు చూస్తున్నారు.

తరచూ ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఏ1 గా ఉన్న సునీల్ ను విచారించాలని డీజీపీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. విచారణాధికారి తాజాగా సునీల్ కు నోటీసులు పంపించారు. డిసెంబరు 4న విజయవాడ లో జరిగే విచారణ కు హాజరు కావాలని ఆదేశించారు. ఈ పరిణామంతో ఆ రోజున ఏం జరిగిందన్న నిజాలు బయటపడతాయని మరియు దీనివెనుక ఎవరు ఉన్నారన్న విషయం వెలుగులోకి వస్తుందని రఘురామ భావిస్తున్నారు.

Related Post