శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు, సీపీఐ(ఎం)నేత, పద్మకుమార్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం సిట్ విచారణకు హాజరైన పద్మకుమార్‌ను, విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆలయం బంగారు చోరీ కేసులో ఎనిమిదో నిందితుడుగా పద్మకుమార్ ఉన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్‌తో పద్మకుమార్‌కు సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరినట్లు సిట్ అధికారులు గుర్తించడంతో అరెస్ట్ చేసినట్టు సమాచారం. శబరిమల ఆలయ రికార్డులు పద్మకుమార్‌కు తెలిసే తారుమారైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రికార్డులలో బంగారు రేకులను.. రాగి రేకులుగా నమోదు చేసినట్టు సిట్ అధికారులు నిర్ధారించుకున్నట్టు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మమ్మర దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, అయ్యప్ప ఆలయ పూజారిగా ప్రచారం చేసుకున్న ఉన్నికృష్ణన్ పొట్టి ఇంటి నుంచి రూ.2 లక్షల నగదును అక్టోబర్‌లో స్వాధీనం చేసుకున్నారు. పొట్టి నుంచి పసిడిని కొనుగోలు చేసిన బళ్లారికి చెందిన వ్యాపారి గోవర్ధన్ నుంచి 400 గ్రాముల బంగారంతో పాటు కొన్ని పసిడి నాణేలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బళ్లారిలో ‘రొద్దమ్ జ్యువెలరీ’ పేరుతో వ్యాపారం చేస్తున్న గోవర్ధన్‌ను అన్ని కోణాల్లోనూ విచారించారు. సిట్ కథనం ప్రకారం.. 2019 లోనే 476 గ్రాముల బంగారాన్ని గోవర్ధన్‌కు పొట్టి విక్రయించారు. వీరిద్దరి మధ్య పలు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఖాతాలు స్పష్టం చేశాయి. వీరు ప్రత్యేక నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు సాగించారు. చెన్నైకి చెందిన ‘స్మార్ట్ క్రియేషన్’ మధ్యవర్తిగా వ్యవహరించింది.
కల్పేష్ అనే వ్యక్తి పొట్టి సూచనల మేరకు ఈ వ్యవహారాన్ని నడిపించారు. అయితే, పొట్టి అభ్యర్థన మేరకు అయ్యప్ప ఆలయం ద్వారానికి మరమ్మతులు చేశానని, ద్వారపాలకుల మరమ్మతుల గురించి తనకేమీ తెలియదని ‘రొద్దమ్ జ్యువెలరీ’ యజమాని గోవర్ధన్ సిట్‌కు ఇంతకు ముందు వెల్లడించారు.
శబరిమల 18 మెట్ల వద్ద నల్ల త్రాచు
ఓవైపు శబరిమల సన్నిధానం భక్తులతో కిక్కిరిసిపోగా… ఓ నల్లత్రాచు పాము 18 మెట్లను అధిరోహించేందుకు ప్రయత్నించిన ఉదంతం చోటు చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్ అటవీ అధికారుల కథనం ప్రకారం… మంగళవారం శబరిమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. సాయంత్రం వేళల్లో ఆ రద్దీ పెరగడంతో నిమిషానికి 80 మంది స్వాములు 18 మెట్లను అధిరోహించారు.
ఈ క్రమంలో పద్దెనిమిది మెట్ల సమీపంలో ఓ నల్లత్రాచు కలకలం రేగింది. అటుగా వచ్చిన పాము… మెట్లపైకి ఎక్కేందుకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు పైనుంచి కేకలు వేస్తూ.. అదిరించడంతో ఆ పాము మెల్లిగా వెనక్కి మరలి.. గణపతి హోమం వైపు వెళ్లింది. సమాచారం అందుకున్న అటవీ బృందం.. కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న స్నేక్ క్యాచర్లను అక్కడకు పంపింది.
అటవీ శాఖ స్నేక్ క్యాచర్లు క్షణాల్లో చాకచక్యంతో ఆ పామును ఓ బ్యాగులో బంధించారు. ఈ వీడియోను రాష్ట్ర అటవీశాఖ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. శబరిమలలో మండల సీజన్‌కు ముందే అటవీశాఖ పంపాబేస్, నీలిమల, శరణ్‌గుత్తి, సన్నిధానం, నీలక్కల్ ప్రాంతాల్లో స్నేక్ క్యాచర్ల బృందాలను మోహరించింది. ఇప్పటి వరకు ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో 10కి పైగా విషసర్పాలు, మరో పాతిక దాకా సాధారణ సర్పాలను పట్టుకున్నట్లు వివరించింది.
The post Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు అరెస్ట్
Categories: