ప్రపంచంలోనే అతిపెద్దదైన, దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో చివరిరోజు ఘోర ప్రమాదం సంభవించింది. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజ్‌స-ఎమ్‌కే1 కూలిపోయింది. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోకి లేచిన తేజస్, నింగిలో విన్యాసాలు చేస్తుండగానే నేరుగా కిందికి జారింది. ప్రదర్శనను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరైన జనం చూస్తుండగానే ఆ యుద్ధ విమానం నేలను తాకి పేలిపోయింది. ఈ ఘటనలో పైలట్ తీవ్రగాయాలతో మృతిచెందినట్లు భారత వాయుసేన ప్రకటించింది. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తేజస్ తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అధికారులు విచారం వ్యక్తంచేశారు. పైలట్ మృతికి సంతాపం తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపింది.
హాల్ అభివృద్ధి చేసిన సింగిల్ సీటర్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్‌సీఏ) ఇది. నెగెటివ్ జీ-ఫోర్స్ (గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలోని శక్తి) టర్న్ నుంచి యుద్ధవిమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో పైలట్ విఫలమవ్వడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. దుబాయ్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఈ ఘటన జరిగింది. 2001 జనవరి 4న తేజస్ మొదటిసారి గాల్లోకి లేచాక అంటే గత 24 ఏళ్లలో ఈ తేలికపాటి యుద్ధ విమానాలు కూలిపోవడం ఇది రెండోసారి. గత ఏడాది మార్చి 12న.. త్రివిద దళాల ఆధ్వర్యంలో శిక్షణా విన్యాసాలు నిర్వహిస్తుండగా పోఖ్రాన్‌కు 100 కి.మీ దూరంలోని రాజస్థాన్ జైసెల్మేర్‌లోని జనావాసాల సమీపంలో తేజస్ కూలిపోయింది. పారాచూట్ ద్వారా బయటపడటంతో పైలట్ ప్రాణాలు దక్కాయి. నవంబరు 17న మొదలైన దుబాయ్ ఎయిర్ షో శుక్రవారమే ముగిసింది.
అది డ్రెయినింగ్ ప్రక్రియలో భాగమే
దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ నుంచి ఆయిల్ లీక్ అవుతున్నట్లుగా సామాజిక మాధ్యమాల కేంద్రంగా పాక్ వీడియోలు షేర్ చేసింది. అలాంటిదేమీ లేదని కేంద్రం గురువారమే స్పష్టం చేసింది. అయితే ఆ మర్నాడే… అంటే శుక్రవారమే ఎయిర్ షోలో తేజస్ కూలిపోవడంతో ‘అయిల్ లీకేజీ’ వార్తల వెనుక వాస్తవం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ బృందం ప్రకారం.. తేజస్ నుంచి ఏ దశలోనూ ఆయిల్ లీకేజీ జరగలేదు. వీడియోల్లో తేజస్ ల్యాండింగ్ వీల్స్ వద్ద కనిపిస్తున్న ద్రవం.. విమానం టేకాఫ్ కు ముందు సహజంగా నిర్వహించే డ్రెయినింగ్ ప్రక్రియలో భాగంగా బయటపడిందేనని పీఐబీ బృందం పేర్కొంది. తేజస్ లో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని పీఐబీ బృందం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రజలకు కేంద్ర సర్కారు కీలక సూచన చేసింది. దేశ రక్షణ సామర్థ్యంపై అనుమానాలను రేకెత్తించేలా కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని, ఇలాంటివి షేర్ చేసేముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని సూచించింది.
మరి ఎలా కూలింది ?
ఎయిర్ షో విన్యాసాల్లో భాగంగా తేజస్ పైలట్ ‘బారెల్ రోల్’ అనే విన్యాసాన్ని ప్రదర్శిస్తుండగా ప్రమాదం సంభవించింది. బారెల్ రోల్‌లో భాగంగా విమానం గాల్లోనే నిలువుగా 360 డిగ్రీలు చుడుతుంది. ఇలా గిరగిరా తిరగడం సంక్లిష్టమైన ప్రక్రియ కానప్పటికీ ఈ విన్యాసంలో పైలట్ క్షణకాలం తలకిందులుగా ఉంటాడు. శుక్రవారం ఎయిర్ షోలో భాగంగా పైలట్… ఈ కచ్చితమైన లూప్‌నకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మొదట పైకి ఎగసి… తర్వాత తలకిందులుగా వెళ్లి… మళ్లీ పైకి ఎగిసే క్రమంలో ప్రమాదం సంభవించింది. విమానాన్ని మళ్లీ పైకి లేపే క్రమంలో వేగం సరిపోకపోవడంతోనే కూలిపోయి ఉండొచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగడం వల్లే కూలిపోయి ఉండొచ్చుననీ భావిస్తున్నారు.
స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన తేజస్ కూలిపోవడం ఇది రెండోసారి. గత ఏడాది మార్చి 12న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్ శక్తి’ విన్యాసాలు జరిగే సమయంలో తొలిసారిగా ఈ జెట్ కూలింది. తాజా ప్రమాదంలో చనిపోయిన పైలట్ నమాంశ్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న నగ్రోటా భగవాన్ పట్టణం. ఆయన భార్య అఫ్సానా కూడా భారత వాయుసేనలో పైలట్‌గా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.
The post Tejas Fighter Jet: దుబాయ్ ఎయిర్‌షోలో కూలిన తేజస్ యుద్ధవిమానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Tejas Fighter Jet: దుబాయ్ ఎయిర్‌షోలో కూలిన తేజస్ యుద్ధవిమానం
Categories: