Tejashwi Yadav : బిహార్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి (మహాగఠ్‌బంధన్) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పేరు ఖరారైంది. ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ’ (వీఐపీ) అధినేత ముఖేశ్ సాహ్నీ పేరును నేతలు ప్రకటించారు. ఇతర వర్గాల నుంచి మరికొందరిని కూడా డిప్యూటీ సీఎంలుగా తీసుకుంటామని తెలిపారు. తేజస్వీ గతంలోనే డిప్యూటీ సీఎంగా పనిచేయగా, సహనీ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.కూటమిలో విభేదాలను సర్దుబాటు చేయడానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ సమక్షంలో కూటమి నేతలు గురువారం పట్నాలో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈ పేర్లను వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల ఆమోదం ఈ ఎంపికలకు ఉందని గహ్లోత్ చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీకి (Tejashwi Yadav) మద్దతివ్వాలని నిర్ణయించాం. ఆయనకు ఎంతో భవిష్యత్తు, ప్రజల అండ ఉన్నాయి. ఉద్యోగాలు, ఇతర హామీలకు ఆయన కట్టుబడి ఉంటారు’ అని చెప్పారు.
Tejashwi Yadav – 20 నెలల్లో చేసి చూపిస్తా – తేజస్వి
కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాకుండా… బిహార్ అభివృద్ధి కోసం తాము చేతులు కలిపామని తేజస్వి చెప్పారు. ‘‘అవినీతి, నేరం అనే ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి కలిసి పనిచేస్తాం. 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ కూటమి ఈసారి నీతీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ఆయనకు ‘అన్యాయం’ చేసింది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి అమిత్‌షా తాజాగా పేర్కొనడమే దానికి గట్టి నిదర్శనం. గతంలో లేని సాంకేతిక కారణాలు ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటివరకు సీఎం ఎవరనేది చెప్పే మీడియా సమావేశాన్నే ఎన్డీయే నిర్వహించలేదు. ప్రజలు మాకు అధికారమిస్తే.. 20 ఏళ్లలో ఎన్డీయే చేయని పనిని 20 నెలల్లో పూర్తిచేస్తాం. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఏ కుటుంబం ఉండదని మేం ప్రతిజ్ఞ చేశాం’’ అని చెప్పారు.
Tejashwi Yadav – ఎవరీ ముఖేశ్ సహనీ ?
వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముఖేశ్ సహనీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో కలిసి నలుగురు అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. అయితే తాను మాత్రం ఓడిపోయారు. అయినా ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన బీజేపీ… కేబినెట్‌లో మత్స్యశాఖ మంత్రిగా తీసుకుంది. అనంతర పరిణామాల్లో ఆయన పార్టీ ఎమ్మెల్యే ఒకరు చనిపోవడం, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆ తర్వా త సహనీకి బీజేపీ అవకాశం ఇవ్వకపోవడంతో మహాగఠ్ బంధన్ తో చేతులు కలిపారు. మరోవైపు… బిహార్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి కృష్ణ అల్లవరును వెంటనే తొలగించాలని డిమాండు చేస్తూ గురువారం పట్నాలో స్థానిక నేతలు ఆందో ళనకు దిగారు. దీనిపై స్పందించిన అధిష్ఠానం… కృష్ణ అల్లవరు యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగానూ కొనసాగు తుండగా ఆ బాధ్యతల నుంచి తప్పించింది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఎన్డీయే వికాసానికి, మహాగఠ్‌బంధన్ వినాశనానికి మధ్య పోరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. ఔరంగాబాద్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తాను పాట్నాలోనే పుట్టి పెరిగానని, ఆర్జేడీ అవినీతి పాలనను కళ్లారా చూశానన్నారు.
28న మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టో విడుదల
బిహార్ ఎన్నికల కోసం మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టోను ఈ నెల 28న పట్నాలో విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి దశ పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav), ఆ తర్వాత రెండో దశ ఎన్నికల కోసం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఛత్ పూజ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రి యాంకా గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటారని మహా కూటమి వర్గాలంటున్నాయి.
Also Read : CM Chandrababu: జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ సేవలు – సీఎం చంద్రబాబు
The post Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్
Categories: