ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ 36వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం కారాకట్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న తేజస్వీ… ‘నాకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జేడీ మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మన ప్రభుత్వం ఏర్పాటయ్యాక… మీకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఉంటుంది. 20 ఏళ్లుగా ఎన్డీయేకు అధికారం ఇచ్చారు. నన్ను నేను నిరూపించుకోవడానికి 20 నెలల సమయం ఇవ్వండి’ అంటూ ప్రజలను కోరారు. మరోవైపు, తేజస్వీకి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మార్పు, ఉద్యోగాలు, సమానత్వంతో పాటు, బిహార్ ప్రజల అభివృద్ధి కోసం పోరాడదామని పేర్కొన్నారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తేజస్వి జీవితంలో ఇంకా పురోగమించాలని తేజ్ ప్రతాప్ ఆకాంక్షించారు.
తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత
బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు ముందు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జనశక్తి జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ‘వై ప్లస్’ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ మంజూరు చేసింది. శత్రువులు తనను హత్య చేసే ముప్పు ఉందని తేజ్ ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. తనను శత్రువులు హత్యచేసే గండం ఉందని, ప్రతి ఒక్కరు శత్రువుల్లాగే కనిపిస్తున్నారని తేజ్ ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు ముప్పు ఉండబట్టే, తనకు కేంద్రం భద్రత పెంచిందన్నారు. అయితే తన శత్రువుల వివరాలను బయటపెట్టలేనని ఆయన స్పష్టంచేశారు.
The post Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్ గిఫ్ట్’ ఉంటుంది – తేజస్వీయాదవ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్ గిఫ్ట్’ ఉంటుంది – తేజస్వీయాదవ్
Categories: