హెల్మెట్ ధరించకపోతే రూ. 500 లేదా రూ. 1000 చలాన్ విధిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించనందుకు దాదాపు రూ. 21 లక్షల చలాన్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెల్మెట్ ధరించనందుకు వచ్చిన రూ.20,74,000 చలాన్ చూసి స్కూటర్ రైడర్ అన్మోల్ సింఘాల్ ఒక్కసారిగా షాకయ్యాడు. న్యూ మండి ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో సింఘాల్… హెల్మెట్ ధరించకపోగా… అతని వద్ద సరైన డాక్యుమెంట్స్ కూడా లేదని పోలీస్ అధికారి పేర్కొన్నారు.
పోలీస్ అధికారి స్కూటర్‌ను స్వాధీనం చేసుకుని… రూ.20,74,000 జరిమానా విధించాడు. ఇది చూసి షాకయిన రైడర్ ఆ చలాన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తప్పు తెలుసుకున్న పోలీస్ అధికారి… ఆ చలాన్ మొత్తాన్ని రూ.4,000 కు సరిచేశారు. దీనిపై ముజఫర్ నగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అతుల్ చౌబే స్పందించారు. చలాన్ జారీ చేసిన సబ్-ఇనస్పెక్టర్ చేసిన పొరపాటు వల్ల జరిమానా తప్పుగా జారీ చేశారు. ఈ కేసు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207కు వర్తిస్తుంది. అయితే ఇనస్పెక్టర్ 207 తర్వాత ‘ఎంవీ యాక్ట్’ అని పేర్కొనడం మర్చిపోయారు. దీంతో రెండూ కలిసిపోయి.. రూ. 2074000గా చలాన్ విధించారు. అయితే రైడర్ చెల్లించాల్సిన ఫైన్ రూ. 4000 మాత్రమే అని స్పష్టం చేశారు.
టీఎంసీ ఎంపీ ఖాతా నుంచి రూ.57 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.57 లక్షలను మాయం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోల్‌కతాలోని ఎస్‌బీఐ విధానసభ బ్రాంచీలో ఖాతాను తెరిచారు. ఎమ్మెల్యే జీతం ఆ ఖాతాలో జమ అయ్యేది. ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఆ ఖాతా ఉపయోగంలో లేదు. దీంతో ఆ ఖాతాపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు కేవైసీ ఫోర్జరీ చేసి, ఖాతాను మళ్లీ ఉపయోగంలోకి తెచ్చారు. అందులోని మొత్తాన్ని ఇతర ఖాతాల్లోకి బదిలీ చేయడంతో పాటు నగల కొనుగోళ్లకు ఉపయోగించారు. నేరగాళ్లు నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి తన ఖాతాను పునరుద్ధరించారని, ఒక మొబైల్ నెంబర్‌ను జతచేసి దాని ద్వారా ఓటీపీలు, లావాదేవీలపై నియంత్రణ పొందారని కల్యాణ్ బెనర్జీ వెల్లడించారు. తమ బ్యాంకు అంతర్గత లోపం కారణంగానే ఈ మోసం జరిగిందని పేర్కొంటూ ఎస్‌బీఐ ఆ మొత్తాన్ని తిరిగి తన పార్లమెంట్ ఖాతాలో జమ చేసిందన్నారు.
జమ్ము కశ్మీర్‌లో విచిత్రమైన ప్రమాదం
జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ సమీపంలో శనివారం ఉదయం రైలు పైకి గద్ద దూసుకొచ్చింది. ఇంజిన్ అద్దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది. ఈ ఘటనలో అద్దాల ముక్కలు గుచ్చకుని లోకో పైలట్ స్వల్పంగా గాయపడ్డాడు. బారాముల్లా–బనిహాల్ ప్యాసింజర్ ట్రైన్ బీజ్బెహారా -అనంత్‌నాగ్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లోకో పైలట్ శ్రీ విషాల్ గాయపడ్డారు. దీంతో అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్‌లో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తిరిగి ప్రయాణానికి అనుమతించారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించారు.
అనంత్‌నాగ్ ప్రాంతం పక్షుల సంచారానికి ప్రసిద్ధి. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సాధారణంగా విమానాలను పక్షులు ఢీ కొట్టే ఘటనలు చూస్తుంటాం. కానీ, ఇలా రైళ్లను ఢీ కొట్టడం చాలా అరుదైన అంశం. అందుకే వార్తల్లోకి ఎక్కింది. ఈ ఘటనపై ప్రాంతీయ రైల్వే అధికారులు పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అదంతా వీడియో తీశారు. ఈ ఘటనకు కారణమైన గద్ద.. లోపలికి వచ్చాక అక్కడే ఓ మూల కూర్చోవడం అందులో చూడొచ్చు.
The post Traffic Police: హెల్మెట్ ధరించలేదని రూ.21 లక్షల ఫైన్! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Traffic Police: హెల్మెట్ ధరించలేదని రూ.21 లక్షల ఫైన్!
Categories: