పరకామణిలో డాలర్ల చోరీ కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ అనంతపురం గుత్తి జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లు అందులో పేర్కొన్నారు. తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్‌వో) వై.సతీష్‌కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసులో తిరుపతిలో సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలారు.
ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్‌కుమార్ గతంలో టీటీడీ ఏవీఎస్‌వోగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్లు నుంచి తిరుపతికి రైలులో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించారు.
సతీష్ కుమార్ మృతిపై టీటీడీ ఉద్యోగుల దిగ్బ్రాంతి
విజిలెన్స్ అధికారిగా చురుగ్గా సుదీర్ఘకాలం సేవలందించిన సతీష్ కుమార్ మృతి టీటీడీ ఉద్యోగులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారిలా కాకుండా టీటీడీ ఉద్యోగిలానే అయన వ్యవహరించేవారని గుర్తు చేసుకుంటున్నారు. తన సెక్టార్ కాకపోయినప్పటికీ ఎక్కడ సమస్య ఎదురైనా సతీ్‌షకుమార్ ఇట్టే వాలిపోయి సేవలందించేవారని అంటున్నారు. విధుల్లో ఆయన భక్తులతో ఎంతో సౌమ్యంగా వ్యవహరించేవారు. శ్రీవారి పరకామణి లెక్కింపు చోరీ కేసులో ఈయన ఫిర్యాదుదారునిగా ఉండడంతో తీవ్రమైన చర్చ జరుగుతోంది.
విజిలెన్స్‌లో ఏడేళ్లు
కర్నూలు జిల్లాలోని పత్తికొండకు చెందిన వై సతీ్‌షకుమార్ రిజర్వ్ ఎస్‌ఐగా విధుల్లో చేరారు. 2017 జూలై 27న టీటీడీ విజిలెన్స్ విభాగానికి విజిలెన్స్ ఇన్ప్సెక్టర్‌గా వచ్చారు. తొలుత శ్రీవారి ఆలయం, తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్ వీఐగా 2022 ఆగస్టు 1వరకు విధులు నిర్వహించారు. ఆ తర్వాత మాతృసంస్థకు బదిలీ అయ్యారు. సీఐగా పదోన్నతి లభించింది. దీంతో నెల వ్యవధిలోనే 2022 సెప్టెంబరు 27న తిరిగి శ్రీవారి ఆలయంలో హుండీ లెక్కింపు పరకామణి ఏవీఎస్వో (అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్)గా నియమితులయ్యారు. 2023లో పరకామణి దొంగతనం కేసు జరిగే వరకు అక్కడే ఏవీఎస్వోగా ఉన్నారు. ఆ తర్వాత సెక్టారు3, లగేజీ ఏవీఎస్వోగా విధులు చేపట్టారు. అదే ఏడాది చివరిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఏవీఎస్వోగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది జూన్ 4వరకు పనిచేశారు. మొత్తంగా పలు సెక్టార్లలో ఏడేళ్ల ఆరునెలల పాటు విధులు నిర్వహించారు.
పరకామణి కేసులో విచారణకు హాజరైన జేఈవో, ఎఫ్‌అండ్‌సీఏవో, మాజీ వీజీవో
తిరుమల పరకామణి చోరీ కేసులో శుక్రవారం పలువురు టీటీడీ అధికారులను డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలోని సీఐడీ బృందం విచారించింది. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి అయిన బాలాజీ, అప్పటి వీజీవో బాలిరెడ్డి, అప్పటి తిరుమల సీఐ చంద్రశేఖర్‌ను విచారించారు. అలాగే ఈ కేసులో నిందితుడు రవికుమార్‌ను పట్టుకున్న రోజు (2023 ఏప్రిట్ 29న) విధుల్లో ఉన్న ఐదుగురు పరకామణి సిబ్బందిని, పెద్దజీయర్ మఠంలోని ముగ్గురు స్వాములతో కలిపి మొత్తం 12 మందిని అధికారులు విచారించారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన మేరకు.. తొలుత జేఈవో వీరబ్రహ్మంతో జరిగిన విచారణలో ‘పరకామణి లెక్కింపునకు ప్రైవేట్ మఠాలైన పెద్ద జియ్యర్, చిన్న జియ్యర్ మఠం ఉద్యోగులను ఎలా అనుమతించారు? రవికుమార్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అంశాన్ని పాలకమండలి సమావేశంలో ఎవరు పెట్టమన్నారు? టేబుల్ అజెండా పెట్టడానికి టీటీడీలో ఉండే నిబంధనలేంటి?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను తిరుపతి పరిపాలన భవనంలో ఉంటానని, అజెండాను ప్రొసీజర్ ప్రకారం సిధ్ధం చేస్తారని ఆయన చెప్పినట్టు తెలిసింది.
ఇక బాలిరెడ్డిని విచారిస్తూ ‘మీ సబ్‌ఆర్డినేట్, అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రవికుమార్‌ను విచారించారా? రాజీ విషయంలో అప్పటి సీవీఎస్వో పాత్ర ఉందా? టీటీడీకి డిప్యుటేషన్‌పై వచ్చేందుకు ఎవరు సపోర్ట్ చేశారు?’’ అని ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. తనకు తెలియదని ఎక్కువ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తుడటంతో… కొండపై కీలక స్థానంలో ఉండి, తెలియదంటే ఎలా అంటూ, మళ్లీ పిలిచినప్పుడు రావాలని విచారణాధికారి చెప్పినట్టు సమాచారం. పరకామణి కేసు ఫిర్యాదుదారుడు, మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన అనంతపురం బయలుదేరి వెళ్లారు.
The post TTD: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
TTD: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసు
Categories: