అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల జట్ల మధ్య ఆసక్తికర పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా హాకీ ఛాంపీయన్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి అనిత విద్యార్థులను పరిచయం చేసుకుని వారి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల ఆకర్షణీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆటలు జీవితంలో ఒక ముఖ్య భాగమని మంత్రి అనిత పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెడతున్నారని,మార్కులు ముఖ్యంకాదని, క్రీడలు ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. ఉమెన్ క్రికెట్‌కు పెరుగుతున్న గుర్తింపును ప్రశంసిస్తూ, బాలికలకు క్రికెటర్ చరణ్ శ్రీ ఆదర్శమని పేర్కొన్నారు. నక్కపల్లిలోనే 40–50 మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలిపారు.
పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహించడంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ఆటల్లో గెలుపు–ఓటములు సహజమని, క్రీడల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ విజేతలే అని అన్నారు. Ncc, Nss కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్వరలో నక్కపల్లిలో హాకీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.
టీచర్ జోష్నా భాయ్ మృతి పట్ల హోం మంత్రి అనిత సంతాపం
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం పాఠశాలలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో మృతి చెందిన టీచర్ జోష్నా భాయ్ పార్థివ దేహానికి,తునిలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించారని, స్థానిక నాయకులు జోష్నా భాయ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు నిలువలేదని తెలిపారు.
జోష్నా భాయ్ చాలా మంచి టీచర్ అని, ఆమెను కోల్పోవడం గ్రామస్తులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని మంత్రి అన్నారు. టీచర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వానిదే అని వెల్లడించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కష్ట సమయంలో కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆమె కోరారు. జోష్నా భాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మంత్రి, ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.
The post Vangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనిత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Vangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనిత
Categories: