బిహార్‌లోని సమస్తీపుర్ జిల్లాలో రోడ్డు పక్కన అధిక సంఖ్యలో వీవీప్యాట్ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండడం కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఎన్నికల సంఘం… ఓ సహాయ రిటర్నింగ్ అధికారిని (ఏఆర్‌వో) సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై కేసు నమోదు చేసింది. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ కళాశాల సమీపంలో లభించిన ఈ స్లిప్పులు మాక్‌పోల్‌కు సంబంధించినవని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. వాస్తవ పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన స్లిప్పులు సురక్షితంగా ఉన్నాయని, ఈ ఘటన వల్ల ఎన్నికల పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లలేదని ఆయన తేల్చి చెప్పారు. రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈవీఎమ్‌లు, వీవీప్యాట్‌ల పనితీరురును పరీక్షించడానికి, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి పోలింగ్ బూత్‌లో మాక్ పోల్స్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ పూర్తయ్యాక, వీవీప్యాట్ స్లిప్పులను ప్రత్యేక కవర్లో సీలు చేసి సురక్షితంగా దాచాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను సంబంధిత అధికారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది.
బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనశక్తి జనతాదళ్ (JJD) నేత తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ ఎంపీ రవి కిషన్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఊహాగాహానాలు మొదలైపోయాయి. ఎన్డీఏ కూటమితో తేజ్ ప్రతాప్ చేతులు కలుపుతారనే ప్రచారం జోరందుకుంది. ఎన్నికల అనంతరం జరిగే పరిణామాలపై తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు ఊతం ఇచ్చాయి.
రవి కిషన్‌ను తొలిసారి కలిశా – తేజ్ ప్రతాప్ యాదవ్
పట్నా విమానాశ్రయంలో శుక్రవారం రవి కిషన్‌తో కలిసి కనిపించారు తేజ్ ప్రతాప్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తొలగించి యువతకు ఉపాధి కల్పించే వారితోనే తాను ఉంటానని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుడిగా మారిన నటుడు రవి కిషన్‌ను తొలిసారిగా కలిసినట్టు చెప్పారు. ఆయన దేవుడి భక్తుడని, తాను కూడా భక్తుడినే అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్నికల తర్వాత పొత్తు గురించి ప్రశ్నించగా.. “ఆప్షన్లు తెరిచి ఉన్నాయి. వేల ఎంపికలు ఉన్నాయి. విజయం తర్వాత, అన్ని ఎంపికలు తెరిచే ఉంటాయిని జవాబిచ్చారు.
ఇందులో రహస్యం లేదు – రవి కిషన్
తేజ్ ప్రతాప్ మంచి మనసున్న వ్యక్తి, భోలేనాథ్ భక్తుడని ఎంపీ రవి కిషన్ ప్రశంసించారు. ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా ప్రజలకు సేవ చేయాలనుకునే వారి కోసం కాషాయ పార్టీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఇందులో ఎటువంటి రహస్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తేజ్ ప్రతాప్, రవి కిషన్ కలయిక బిహార్ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తేజ్ ప్రతాప్, ఆయన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఆత్మగౌరవమే ముఖ్యం
తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నుంచి బహిష్కరణకు గురయ్యారు. 12 ఏళ్లుగా ఓ మహిళతో అనైతిక సంబంధం కొనసాగించారనే ఆరోపణలతో ఆయనను ఆర్జేడీ నుంచి బయటకు పంపించారు. అయితే ఈ ఆరోపణలను తేజ్ ప్రతాప్ తోసిపుచ్చారు. ప్రాణం పోయినా తిరిగి ఆర్జేడీలోకి వెళ్లబోనని ఆయన శపథం చేశారు. అధికారం పట్ల వ్యామోహం లేదని, ఆత్మగౌరవమే తనకు ముఖ్యమన్నారు. తర్వాత సొంతంగా జనశక్తి జనతాదళ్ పార్టీని సొంతంగా స్థాపించారు.
The post VVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
VVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు
Categories: