జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు–2024లో తెలంగాణ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’విభాగంలో తెలంగాణ టాప్‌లో నిలిచి సత్తా చాటింది. సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అధికారులు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో 5,20,362 జల సంరక్షణ పనులను పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేస్తూ.. రూఫ్‌టాప్ వాన నీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణలో రాష్ట్రం చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించింది.
జిల్లాల విభాగంలో (దక్షిణ జోన్–కేటగిరీ 1) తెలంగాణ జిల్లాలదే ఏకచక్రాధిపత్యం నడిచింది. మొదటి మూడు స్థానాలను మన జిల్లాలే కైవసం చేసుకోవడం విశేషం. ఆదిలాబాద్, నల్లగొండ, మంచిర్యాల జిల్లాలు టాప్–3 జిల్లాలుగా నిలిచాయి. ఈ మూడు జిల్లాలకు మొదటి కేటగిరీ కింద ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున, మొత్తం రూ.6 కోట్ల నగదు బహుమతి దక్కింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు గాను.. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. ఇందుకు గాను రూ.2 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుంది.
కేటగిరీల వారీగా మెరిసిన జిల్లాలు ఇవే
కేటగిరీ–2 (దక్షిణ జోన్): వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచి.. ఒక్కో జిల్లా రూ.కోటి చొప్పున బహుమతిని గెలుచుకున్నాయి.
కేటగిరీ–3: భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలు 1, 3 ర్యాంకుల్లో నిలిచి.. చెరో రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నాయి.
అవార్డులు స్వీకరించిన అధికారులు వీరే
శ్రీజన (ఐఏఎస్): పీఆర్, ఆర్డీ కమిషనర్ (రాష్ట్రం తరఫున)
కె.అశోక్ కుమార్ రెడ్డి: ఎండీ, జలమండలి
రాజర్షి షా: కలెక్టర్, ఆదిలాబాద్
జె.శ్రీనివాస్: అడిషనల్ కలెక్టర్, నల్లగొండ
కుమార్ దీపక్: కలెక్టర్, మంచిర్యాల
సత్యశారద: కలెక్టర్, వరంగల్, అభిలాష అభినవ్: కలెక్టర్, నిర్మల్ రిజ్వాన్ బాషా షేక్: కలెక్టర్, జనగామ
జితేశ్ వి.పాటిల్: కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం
బి.విజయేందిర: కలెక్టర్, మహబూబ్‌నగర్
అలాగే పలు జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘం అధికారి సతీశ్‌కూ అవార్డు దక్కింది.
The post Water Awards: ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Water Awards: ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం !
Categories: