గత ఏడాది తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. నాగచైతన్య మాజీ భార్య సమంత పేరు ప్రస్తావించి.. పత్రికలో రాయలేని విధంగా ఆమె దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లపై సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఒక మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సోషల్ మీడియాలో ఊరూ పేరు లేని వాళ్లలా అలాంటి కామెంట్లు చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తాయి. అంత వ్యతిరేకత వచ్చాక కూడా సురేఖ తన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పలేదు. తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం తీవ్రంగానే స్పందించింది. నాగార్జున.. సురేఖ మీద పరువు నష్టం దావా వేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు.
ఐతే తన వ్యాఖ్యల విషయమై కొండా సురేఖలో ఇన్నాళ్లకు పశ్చాత్తాపం వచ్చింది. 2024 అక్టోబరు ఆరంభంలో సురేఖ ఆ చీప్ కామెంట్స్ చేశారు. పరువు నష్టం దావా విషయంలో నాగార్జున అస్సలు తగ్గని నేపథ్యంలో సురేఖ ఎట్టకేలకు దిగి వచ్చి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు మంత్రి.
‘‘నాగార్జున గారికి సంబంధించి నా వ్యాఖ్యల విషయమై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఆయన, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశం నాకు లేదు. వారిని బాధించే, వారి పరువుకు నష్టం చేకూర్చే ఉద్దేశం కూడా నాకు లేదు. నా వ్యాఖ్యలు దురుద్దేశ భావన కలిగించి ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.
ఐతే అలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసిన 13 నెలలకు ఇలా స్టేట్మెంట్ ఇచ్చిన సురేఖ.. కనీసం క్షమాపణ చెప్పకుండా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మాత్రమే పేర్కొనడం పట్ల విమర్శలే వస్తున్నాయి. నాగ్, చైతూలతో పాటు సమంతకు కూడా ఆమె క్షమాపణ చెప్పాలడే డిమాండ్లు వినిపిస్తున్నాయి.