తండ్రి అనే పదానికి అర్థమే మార్చేశాడు ఓ కిరాతకుడు. కన్న కూతురినే కాటేసిన ఈ దుర్మార్గుడికి కేరళలోని మంజేరి పోక్సో కోర్టు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చింది. అక్షరాలా 178 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజంలో ఇలాంటి కామాంధులకు భయం పుట్టేలా, ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణానికి న్యాయం చేస్తూ ఈ తీర్పు వెలువడింది. మనిషి రూపంలో ఉన్న మృగాడికి కోర్టు ఇచ్చిన షాక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ నిందితుడి నేర చరిత్ర వింటేనే అసహ్యం వేస్తుంది. ఇతను ఇదివరకే పక్కింట్లో ఉండే ఓ దివ్యాంగ మహిళపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లాడు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాక బుద్ధి మార్చుకుంటాడని అనుకుంటే, మరింత బరితెగించాడు. ఇంట్లో ఉన్న సమయంలో తన ఎనిమిదేళ్ల కూతురిపైనే కన్నేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, కామాంధుడిగా మారి 2022 నుంచి 2023 మధ్య ఏకంగా మూడుసార్లు ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఆ చిన్న ప్రాణాన్ని నరకంలోకి నెట్టేశాడు.
పాపం ఆ చిన్నారి భయంతో మొదట ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఒకసారి స్కూల్లో రక్తస్రావం గమనించిన టీచర్లు ఆసుపత్రికి తీసుకెళ్తే, తండ్రి కాలు తగిలిందని అబద్ధం చెప్పింది. కానీ, స్కూల్లో ఓ టీచర్ ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ గురించి పాఠం చెబుతున్నప్పుడు ఆ పాపలో ధైర్యం వచ్చింది. తన తండ్రి చేస్తున్న పైశాచికత్వాన్ని టీచర్‌కు పూసగుచ్చినట్లు వివరించింది. ఆ మాటలు విన్న టీచర్ షాక్ తిని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అంతకుముందే ఆ పాప తల్లికి విషయం చెప్పగా, భార్యాభర్తల మధ్య గొడవ జరిగి నిందితుడు పారిపోయాడు.
పోలీసుల ఎంట్రీతో కథ మలుపు తిరిగింది. అరీకోడ్ పోలీసులు కేసు నమోదు చేసి, తల్లి సమక్షంలోనే పాప స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. కోర్టు విచారణలో ఈ నేరం ఎంత తీవ్రమైనదో రుజువైంది. కన్న కూతురిపైనే ఇంతటి క్రూరత్వానికి పాల్పడిన వాడికి శిక్షలో ఎలాంటి తగ్గింపు ఉండకూడదని జడ్జి స్పష్టం చేశారు. పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఒక్కో నేరానికి 40 ఏళ్ల చొప్పున (మొత్తం 120 ఏళ్లు), ఐపీసీ సెక్షన్ల కింద మరో 58 ఏళ్లు కలిపి.. మొత్తంగా 178 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు.
వినడానికి 178 ఏళ్లు అని ఉన్నా, చట్టంలోని నిబంధనల ప్రకారం శిక్షలన్నీ ఏకకాలంలో (Concurrently) అమలవుతాయి. అంటే, గరిష్టంగా ఉన్న 40 ఏళ్ల శిక్షను అతను అనుభవించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ నిందితుడి వయసు 46 ఏళ్లు. అంటే దాదాపు తన జీవితకాలం మొత్తం జైలు గోడల మధ్యే మగ్గిపోవాల్సిందే. రేపిస్టులకు, ముఖ్యంగా సొంత పిల్లలపైనే అఘాయిత్యాలకు పాల్పడే కీచకులకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక లాంటిది.