hyderabadupdates.com movies ‘అనంతపురం అంటే టీడీపీ..టీడీపీ అంటే అనంతపురం’

‘అనంతపురం అంటే టీడీపీ..టీడీపీ అంటే అనంతపురం’

తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లా కంచుకోట వంటిది. అన్న ఎన్టీఆర్ మొదలు బాలకృష్ణ వరకు అందరినీ అనంతపురం అక్కున చేర్చుకుంది. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ వంటి నేతలను ఆ జిల్లా అందించింది. ఇక, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురంలోని 14 స్థానాలకుగాను 14 టీడీపీ కైవసం చేసుకుందంటే అక్కడ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అనంతపురం అంటేనే టీడీపీ…టీడీపీ అంటేనే అనంతపురం అంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

2 రోజుల పర్యటన కోసం లోకేశ్ అనంతపురం వెళ్లారు. తొలి రోజు పర్యటనలో భాగంగా కల్యాణదుర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే అనంతపురం.. అనంతపురం అంటే టీడీపీ అని అన్నారు. తమ కుటుంబాన్ని అనంతపురం ప్రజలు ఆశీర్వదించి దీవించారని, ఎన్టీఆర్ గారిని, హరికృష్ణ గారిని, బాలకృష్ణ గారిని గెలిపించారని గుర్తు చేసుకున్నారు. అనంతపురం. జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు.

కల్యాణదుర్గంలో భక్త కనకదాస 538వ జయంతి కార్యక్రమానికి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని లోకేశ్ ఆవిష్యరించారు. కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా తొలి జయంతిని కల్యాణదుర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ వర్గీయుల అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పారు. కురబ సోదరులు ఎన్నో ఏళ్లుగా టీడీపీతో ఉన్నారని, వారిని తన గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. బీటీ ప్రాజెక్టును ప్రారంభించింది తామేనని, పూర్తి చేసేది కూడా తామేనని అన్నారు. కరవుసీమలో కార్లు పరుగులు పెట్టించామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నామని చెప్పారు.

Related Post