ఒకప్పుడు ఆయన నోరు విప్పితే వివాదాలు.. విమర్శలు.. ఘర్షణలు అనే పేరు ఉండేది. కానీ, గత ఎన్నికల తర్వాత.. ఆయన సంపూర్ణంగా మారిపోయారు. వివాదాల జోలికి పోవడం లేదు. పైగా నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఆయనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తరచుగా ప్రజల మధ్య ఉంటున్నారు. వారి సమస్యలపై దృష్టి పెడుతున్నారు. గతంలో మాదిరి కాకుండా.. ఇప్పుడు విజ్ఞతతో కూడిన రాజకీయాలు.. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆయన అపర భగీరథుడు అనే పేరు తెచ్చుకున్నారు. చింతమనేని అభిమానులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. దీనికి కారణం.. దెందులూరు నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలను తీర్చటం కోసం ప్రయత్నిస్తుండడమే. ఏడాదిలో 365 రోజులు కూడా తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాల ప్రజలకు తాగు నీరు అందించటమే లక్ష్యంగా 295 కోట్ల రూపాయల వ్యయంతో భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ రూపకల్పనకు చింతమనేని ప్రయత్నిస్తున్నారు.
పక్కనే పారుతున్న గోదావరి జలాలను.. ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల ప్రజలకు అందించడానికి గతంలో రూ.1400 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ గ్రిడ్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దెందులూరు నియోజకవర్గానికి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరం వద్ద నుంచి పైపులైన్లు ఏర్పాటు చేసి గోదావరి జలాలను దెందులూరు నియోజకవర్గం కి తీసుకురావాలని చింతమనేని సంకల్పించారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో చర్చించారు. ఆ వెంటనే సదరు ప్రాజెక్టుపై డిపిఆర్ సిద్ధం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం ఆదేశాలు జారీ చేశారు. గోదావరి జలాలను ధవళేశ్వరం నుంచి దెందులూరు నియోజకవర్గానికి తీసుకువస్తే 402 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చవుతుందని పేర్కొన్న నేపథ్యంలో కొప్పాక వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మించి పోలవరం కుడి కాలువ ద్వారా ప్రజలకు అందిస్తే, కేవలం రూ.295 కోట్ల రూపాయలకే ప్రాజెక్టు పూర్తవుతుందని నిర్ణయించారు. దీనిపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇది సాకారం అయితే.. దెందులూరుతో పాటు ఉంగుటూరు ప్రజలకు కూడా నిరంతరం నీరు అందుబాటులోకి రానుంది.