ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతానికి ఇప్పటికి ఆయన చాలా తేడా చూపిస్తున్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్నా, ఏమో ఏదైనా తేడా జరిగినా, అమరావతి విషయంలో గతంలో అంటే 2019-24 మధ్య జరిగినట్టుగా జరగకూడదని ఆయన భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో అమరావతి నిర్మాణాలపై అనేక లక్ష్యాలు, నిర్దేశిత గడువులు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగానే 2027 చివరి నాటికి తొలి దశ అమరావతి నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనిపై ప్రత్యేక కార్యాచరణను కూడా రెడీ చేసుకున్నారు.
ఇలా రాజధానిని పరుగు పెట్టించే క్రమంలో దీనిలో ఇమిడి ఉన్న ఇతర ప్రాజెక్టులకు ఎస్పీవీ అనే ఇంధనాన్ని జోడించారు. ఫలితంగా ఆయా ప్రాజెక్టులు మరింత వేగంగా పరిగులు పెట్టనున్నాయి. అంతేకాదు, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు బాధ్యతను కూడా ఎస్పీవీ చోదక శక్తిగా మారుతుందని సీఎం చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
తాజాగా ఎస్పీవీకి చట్టబద్ధత కల్పించారు. దీనికి సంబంధించిన జీవోను మంగళవారం రాత్రి ప్రభుత్వం జారీ చేసింది. అంటే ఇక ఎస్పీవీ చట్టబద్ధమైనదని చెప్పొచ్చు.
ఏంటిది ఎస్పీవీ?ఎస్పీవీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ (ప్రత్యేక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసే కీలక విభాగం). దీనిని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అంటే రాజధానిలో ఈ ఎస్పీవీ కింద చేపట్టే పనులను ముందుగానే పేర్కొంటారు. అదేవిధంగా సంబంధిత ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని ముందుగానే నిర్దేశించి ఈ ఖాతాలో జమ చేస్తారు.
సదరు నిధులు ఈ ఖాతా నుంచి ఆయా ప్రాజెక్టులకు చేరతాయి. దీనిలో పక్కా లెక్క ఉంటుంది. అదేవిధంగా ఆడిటింగ్ కూడా చేస్తారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తరచుగా రాష్ట్రాలను ఎస్పీవీలను ఏర్పాటు చేయాలని కోరుతుంది.
ఎస్పీవీ కింద చేసే పనులు ఇవే:
రాజధానిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారీ విగ్రహ నిర్మాణం చేపడతారు.
అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తారు.
స్మార్ట్ పరిశ్రమలను కూడా ఈ విధానంలోనే ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారు.
క్రీడా నగర నిర్మాణం కూడా దీనికిందే చేపట్టనున్నారు.
అత్యంత కీలకమైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా ఎస్పీవీ కిందనే చేస్తారు.