ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు. నిర్మాణాలు కూడా వడివడిగా సాగుతున్నాయి. గత వైసీపీ హయాంలో ఐదేళ్లు పడకేసిన నిర్మాణాలతో అమరావతి అటవీ ప్రాంతాన్ని తలపించింది. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చాక 40 కోట్ల రూపాయల వరకు ఖర్చుచేసి.. అటవీ ప్రాంతంగా ఉన్న అమరావతిలో తిరిగి బాగు చేత కార్యక్రమాలు చేపట్టింది. ఆ వెంటనే కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి నిధులు తీసుకువచ్చి ప్రస్తుతం పనులు వేగంగా చేస్తోంది. అంతేకాదు.. మొదట్లో 33 వేల ఎకరాలుగా ఉన్న అమరావతిని ప్రస్తుతం మరో 42 వేల ఎకరాలకు విస్తరించే పనిని కూడా చేపట్టింది.
అయితే.. అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ.. తాజాగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిని మరోసారి మార్చకుండా.. వైసీపీ చేతులు పడకుండా.. దీనిని సంరక్షించుకోవాలన్న లక్ష్యంతో రైతులు.. ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిని పార్లమెంటులో పెట్టి చట్టం చేస్తే.. ఇక,మార్చేందుకు.. దీనిపై వైసీపీ నాయకులు సహా.. అమరావతి అంటే గిట్టని వారు వేలు పెట్టేందుకు కూడా అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. ఈ మేరకు అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి.. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. త్వరలోనే ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిపై చట్టం చేసేలా ప్రయత్నించాలని కోరారు.
ఇదేసమయంలో వైసీపీ హయాంలో తీసుకువచ్చిన ఆర్-5 జోన్‌ను రద్దు చేయాలని కూడా ఐక్య కార్యాచరణ సమితి నాయకులు సర్కారుకు విన్నవించారు. ఆర్-5 జోన్ అంటే.. రాష్ట్రంలోని పేదలు.. అమరావతిలో నివసించేందుకు హక్కు కల్పించడం. దీనిని అడ్డు పెట్టుకునే గతంలో వైసీపీ ప్రభుత్వం అమరావతిలో పేదలకు భూములు ఇచ్చింది. అయితే.. నిర్మాణాలు చేపట్టలేదు. ఇంతలో దీనిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. పేదల ఇళ్లను రద్దు చేశారు. కానీ, ఆర్-5 జోన్‌ను మాత్రం రద్దు చేయలేదు. దీనిని కూడా రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. తద్వారా అమరావతికి పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందని వారు చెబుతున్నారు.
అలానే.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న మూడు రాజధానుల పిటిషన్(వైసీపీ హయాంలో దాఖలు చేశారు)ను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. అమరావతినే రాజధానిగా గుర్తించిన నేపథ్యంలో మూడు రాజధానులతో పనిలేదని.. ఈనేపథ్యంలో నాటి పిటిషన్ వెనక్కి తీసుకోవాలని.. ఇది చిన్న విషయమేనని రైతులు చెబుతున్నారు. అలాగే కౌలు అందని రైతులకు ఈ నిధులు కూడా ఇవ్వాలని కోరారు. అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రిటర్న్‌బుల్ ఫ్లాట్లను వెంటనే కేటాయించాలని కూడా కోరుతున్నారు.