రాజధాని అమరావతి విషయంలో రెండో దశ భూ సమీకరణ వ్యవహారం ఒకింత ఇబ్బందిగా మారింది. కొందరు గతంలో భూములు ఇచ్చిన రైతులు.. తమకు ఇంకా ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందలేదని భీష్మించారు. దీంతో రెండోదశ భూసేకరణ విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణలతో కూడిన కమిటీని వేసింది. అయినప్పటికీ.. రైతులు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని ప్రభుత్వం రంగంలోకి దింపింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నసమయంలో రెండు పర్యాయాలు ఆయన రాజధాని ప్రాంతం లో పర్యటించి.. రైతుల సమస్యలు విన్నారు. భూ సమీకరణకు అప్పట్లో ఆయన కూడా రైతులను ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రైతులతో చర్చించేందుకు మరోసారి సుజనా చౌదరి రంగంలోకి దిగారు. తాజాగా ఆయన.. రాజధాని రైతులతో భేటీ అయ్యారు.
వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని.. రాజధానిని మరింత అభివృద్ధి చేసుకుంటే.. ఆదాయం మరింత పెరుగుతుందని.. రైతులకు ఇచ్చిన ప్రతిహామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం భూసమీకరణకు సహకరించాలని ఆయన సూచించారు. అంతేకాదు.. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. అధికారులు స్పందించేలా రైతులకు సాయం చేసేలా చేస్తానని హామీ ఇచ్చారు.
గతంలో 14 రకాల సమస్యలు ఉంటే.. అధికారుల ఉదాసీనత కారణంగా.. ఇప్పుడు 20 సమస్యలకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై అధికారులతోనూ సంప్రదించి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొత్తంగా నిన్న మొన్నటి వరకు రైతులు భీష్మించినా.. సుజనా చౌదరి మధ్యవర్తిత్వంతో ఒకింత దిగి వచ్చారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు సహకరించాలని.. తాము కూడాసహకరిస్తామని హామీ ఇచ్చారు.