ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ ఏడాదిలో తొలిసారి ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత అయోధ్య రామజన్మభూమిని సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి లక్నో చేరుకున్న ఆయన.. అయోధ్యకు వెళ్లి బాల రామయ్య ఆలయంలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా రామజన్మభూమి ట్రస్టు అధ్యక్షుడు, ఆలయ ప్రధాన పూజారులు, అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం.. గర్భాలయంలోకి వెళ్లిన చంద్రబాబు బాలరామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
చంద్రబాబుకు ప్రత్యేక మాలను ధరింప చేసిన ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా చంద్రబాబుతో పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. అనంతరం.. ఆలయం చుట్టూ కలియదిరిగిన సీఎం.. ఆలయ ఆవరణలో నిర్మించిన వివిధ పరివార దేవతల కోవెలలను కూడా దర్శించుకున్నారు.
అధికారులు.. ఆయనకు ఆలయ విశేషాలను వివరించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన ధ్వజాన్ని(పతాకం) కూడా చంద్రబాబు వీక్షించారు. ఆలయంలోనే ధ్యాన మండపం కూడా ఉండడంతో అక్కడ కొద్ది సేపు ధ్యానం చేశారు.
ఆర్ ఎస్ ఎస్ సూచనలతోనే..
ఇటీవల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తిరుపతిలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభోత్సవానికి మోహన్ భాగవత్‌కు వచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఆయన అయోధ్య విశేషాలను వివరించారు. త్వరలోనే అయోధ్యను దర్శించాలని మోహన్ భాగవత్ సూచించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
వెను వెంటనే చంద్రబాబు.. ఆదివారం అయోధ్యలో పర్యటించడం విశేషం.. ఈ సందర్భంగా చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడు నేర్పిన విలువలు నేటి తరానికి ఆదర్శమన్నారు. రామరాజ్య స్థాపనకు శ్రీరాముడి పాలనే స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.