కొందరు హీరోలకు అయితే అతివృష్టి లేదా అనావృష్టిలా ఉంటుంది రిలీజుల వ్యవహారం. అల్లరి నరేష్ గత ఏడాది ఏకంగా మూడు సినిమాల్లో కనిపించాడు. నా సామిరంగా విజయం నాగార్జున ఖాతాలోకి వెళ్లిపోగా ఆ ఒక్కటి అడక్కు, బచ్చల మల్లి తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో కామెడీ చేయాలో సీరియస్ జానర్ కు కట్టుబడాలో అర్థం కాక అల్లరోడు కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. అది కాస్తా ఏకంగా పది నెలలకు చేరుకుంది. ఇప్పుడు కేవలం 40 రోజుల వ్యవధిలో 2 సినిమాలతో ప్రేక్షకులనుం పలకరించబోతున్నాడు. నవంబర్ ఇరవై ఒకటిన 12 రైల్వే కాలనీతో సస్పెన్స్ అభిమానులను థ్రిల్ చేయడానికి వస్తున్నాడు. నిన్నే అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
పొలిమేర సిరీస్ సృష్టికర్త అనిల్ విశ్వనాధ్ కథను అందించిన 12 రైల్వేకాలనీలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట. దీని సంగతలా ఉంచితే కొత్త ఏడాది 2026 మొదటి రోజు తొలి బోణీ చేయబోయేది అల్లరి నరేషే. జనవరి ఒకటిన ఆల్కహాల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మందు తాగకుండానే స్నేహితులను మందులో ముంచెత్తే వెరైటీ క్యారెక్టర్ ని ఇందులో పోషించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణం కావడంతో కంటెంట్ ఏదో సాలిడ్ గానే ఉండేలా ఉంది. సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పది రోజుల అడ్వాంటేజ్ చాలనుకుంటున్న ఆల్కహాల్ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని టీమ్ నమ్మకం.
ఈ రెండు సినిమాలు సక్సెస్ కావడం అల్లరి నరేష్ కు చాలా కీలకం. ఎందుకంటే సోలోగా మార్కెట్ బాగా డౌన్ అయిన టైంలోనూ దర్శక నిర్మాతలు తనతో చేతులు కలుపుతూనే ఉన్నారు. ఆ నమ్మకం కొనసాగాలంటే హిట్లు చాలా అవసరం. ఇప్పటికీ ఫ్యాన్స్ లో తన మీద గుడ్ విల్ ఉంది. సరైన కథ, కాంబో పడితే సత్తా చాటుతాడనే కాన్ఫిడెన్స్ కొత్త సినిమాల ఓపెనింగ్స్ టైంలో చూపిస్తూ ఉంటారు. దాన్ని నిలబెట్టుకునేలా హిట్టు పడాలి. మరి ఇంత తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులతో వస్తున్న అల్లరోడికి రెండు డిఫరెంట్ జానర్లు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయో వేచి చూడాలి. వీటికి ప్రత్యేక ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు.