hyderabadupdates.com movies ఆ ప్రశ్నకు బైసన్ దర్శకుడు హర్ట్

ఆ ప్రశ్నకు బైసన్ దర్శకుడు హర్ట్

తమిళంలో కుల వివక్ష మీద సినిమాలు మిగతా భాషలతో పోలిస్తే కాస్త ఎక్కువే వస్తుంటాయి. అక్కడ కొందరు దర్శకుడు ‘కులం’ కోణం లేకుండా సినిమాలే తీయరని పేరుంది. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పా.రంజిత్ గురించి. చిన్నతనం నుంచి కులవివక్షను ఎదుర్కొని.. ఎన్నో కష్టాలు పడి ఎదిగిన రంజిత్.. తన ప్రతి సినిమాలోనూ ఆ అంశాలను స్పృశిస్తూ ఉంటాడు. ‘అట్టకత్తి’ నుంచి ‘తంగలాన్’ వరకు ప్రతి సినిమాలోనూ ఈ కోణాన్ని చూడొచ్చు.

రంజిత్ తర్వాత.. మారి సెల్వరాజ్ అనే మరో దర్శకుడు కూడా ఈ కోవకే చెందుతాడు. ‘పరియేరుమ్ పెరుమాల్’ అనే నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దాంతో పాటు కర్ణన్, మామన్నన్, వాళై.. తాజాగా వచ్చిన ‘బైసన్’ కులం చుట్టూ తిరిగే సినిమాలే. ఐతే తన సినిమాలంటే ఇలాగే ఉంటాయి అనే ఒక ముద్ర పడిపోయింది. ‘బైసన్’ చూశాక కొంతమంది ఈ విషయంలో విమర్శలు కూడా చేశారు.

ఐతే ఈ కామెంట్లకు దర్శకుడు మారి సెల్వరాజ్ బాగానే హర్టయినట్లున్నాడు. ఎప్పుడూ ఇవే సినిమాలే అనే వాళ్లకు అతను ఒక ప్రెస్ మీట్లో సమాధానం చెప్పాడు. ఇలాంటి కామెంట్లు తనను చాలా బాధ పెడతాయన్నాడు. సంవత్సరంలో ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమాలు 250-300 దాకా వస్తాయని.. మరి అవే ఎందుకు తీస్తారని ఎవ్వరూ అడగరని.. కానీ సామాజిక సమస్యల మీద తన లాంటి వాళ్లు సినిమాలు తీస్తే మాత్రం వాటి మీద ప్రశ్నలు సంధిస్తారని అతనన్నాడు.

తాను ఎవరో ఏదో అన్నారని మారనని.. ఇలాంటి సినిమాలు తీయడంలో తాను చాలా మొండి పట్టుదలతో ఉన్నానని మారి తెలిపాడు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలోనే తాను ఈ తరహా సినిమాలు తీస్తున్నానని.. ఇవి సమాజానికి చాలా అవసరమని అతను అభిప్రాయపడ్డాడు. బైసన్ మీద ప్రేమ చూపిస్తున్న వాళ్లందరికీ అతను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. దీపావళికి తమిళంలో విడుదలై విజయవంతమైన బైసన్.. ఈ వీకెండ్లో తెలుగులోనూ రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంటోంది.

Related Post

రాజధాని రైతుల రుణమాఫీపై బాబు ఏమన్నారు?రాజధాని రైతుల రుణమాఫీపై బాబు ఏమన్నారు?

ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రూ.1.50 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.

మృణాల్… ఎట్టకేలకు తమిళ సినిమాలోకిమృణాల్… ఎట్టకేలకు తమిళ సినిమాలోకి

బాలీవుడ్ నుంచి హీరోయిన్లు దక్షిణాదికి దిగుమతి కావడం దశాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయమే. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీల్లో స్థానిక కథానాయికల కంటే నార్త్ ఇండియన్ హీరోయిన్లే ఎక్కువగా ఉంటారు. ఉంటున్నారు. దక్షిణాదిన ఏదో ఒక భాషలో ఒక బాలీవుడ్ హీరోయిన్‌కు పెద్ద హిట్ పడిందంటే..