చాలా ఏళ్ల నుంచి గీతా ఆర్ట్స్ సంస్థలో అంతర్భాగంగా ఉంటూ.. ‘జీఏ2’ బేనర్ మీద సినిమాలు నిర్మిస్తున్న బన్నీ వాసు.. ఈ మధ్యే సొంతంగా ‘బన్నీ వాసు వర్క్స్’ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వేరే చిత్రాలను తన బేనర్ మీద రిలీజ్ చేస్తున్నాడు. వంశీ నందిపాటితో కలిసి ఆయన రిలీజ్ చేసిన తొలి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ సంచలన విజయం అందుకోగా.. రాజు వెడ్స్ రాంబాయి, ఈషా చిత్రాలు కూడా మంచి ఫలితం సాధించాయి.
కానీ బన్నీ వాసు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన ‘మిత్రమండలి’ మాత్రం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. విడుదలకు ముందు మంచి హైప్ అయితే తెచ్చుకుంది కానీ.. సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా వల్ల రూ.6 కోట్లు పోయినట్లు వాసు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమా ఎక్కడ తేడా కొట్టిందో కూడా ఆయన వివరించాడు.
‘‘మిత్రమండలి సినిమా బాగా ఆడుతుందని అనుకున్నాం. మేకింగ్ టైంలో దాని మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కామెడీ బాగా వర్కవుట్ అవుతుందని.. జనాలను బాగా నవ్వించగలమని అనుకున్నాం కానీ ఎడిటింగ్‌లో తప్పు జరిగింది. ఆర్ఆర్ కూడా సరిగా చేయలేదు. ఆ సినిమాకు సంబంధించి అతి పెద్ద తప్పేంటంటే.. నేను రిలీజ్‌కు ముందు ఫైనల్ కాపీ చూడలేదు. అప్పుడు సెంటిమెంటుగా ఒక గుడికి వెళ్లాల్సి ఉంటే మూడు రోజులు అందుబాటులో లేకుండా పోయాను.
నేను ఒకసారి ఫైనల్ కాపీ చూసుకుని ఉండాల్సింది. ఈ సినిమాకు ప్రిమియర్స్ వేసినపుడు థియేటర్లో కూర్చుని సినిమా చూశాను. నేను ఫలానా చోట జనాలు బాగా నవ్వుతారని అనుకున్నా. కానీ మొదట్లోనే కొన్ని సీన్ల దగ్గర నా అంచనా తప్పింది. జనాలు నవ్వట్లేదు. దీంతో సినిమా మిస్ ఫైర్ అయిందని అర్థమైపోయింది. ఈ సినిమా వల్ల అందరం కలిపి రూ.6 కోట్లు పోగొట్టుకున్నాం’’ అని బన్నీ వాసు వివరించాడు.