ఈ నెలాఖరులో విడుదల కాబోతున్న ఆంధ్రకింగ్ తాలూకా మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. టాలీవుడ్ కు కొత్తగా పరిచయమవుతున్న వివేక్ మెర్విన్ ఇచ్చిన పాటలు ఛార్ట్ బస్టర్ కావడంతో పాటు సినిమా విడుదలయ్యాక మరింత రీచ్ తెచ్చుకుంటాయనే నమ్మకం మేకర్స్ లో కలిగించాయి. హీరోయిన్ భాగశ్రీ బోర్సేతో కలిసి రామ్ యుఎస్ లో నాలుగు రోజుల పాటు అక్కడి ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్లు చూడబోతున్నాడు. ఇండియా కంటే రెండు రోజుల ముందే అమెరికాలో షో పడుతుంది. కంటెంట్ మీద చాలా నమ్మకం ఉంటే తప్ప ఇంత రిస్క్ ఎవరూ చేయరు. ఆ కాన్ఫిడెన్స్ తోనే రామ్ అక్కడికి వెళ్తున్నాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ ఆంధ్రకింగ్ తాలూకా నవంబర్ చివర్లో కన్నా రెండు లేదా మూడో వారంలో వచ్చి ఉంటే ఎక్కువ మైలేజ్ వచ్చేది. ఎందుకంటే ఈ నెలలో సాలిడ్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న మూవీ లేదు. ది గర్ల్ ఫ్రెండ్ పర్వాలేదనిపించుకుంటున్నా కింది సెంటర్లలో కలెక్షన్లు లేవు. పోటీలో ఉన్నవి కనీస రన్ లేక నీరసించిపోయాయి. ఇప్పుడు భారమంతా కాంత మీద ఉంది. తమిళ డబ్బింగ్ అయినా దుల్కర్ సల్మాన్ ఉన్నాడు కాబట్టి మనోళ్లు మంచి ఓపెనింగ్స్ ఇచ్చేలా ఉన్నారు. కాకపోతే నేటివిటీ సమస్య లేకుండా ఇక్కడి ఆడియన్స్ ని మెప్పిస్తేనే బొమ్మ మీద హిట్టు స్టాంప్ పడుతుంది.
ఆంధ్రకింగ్ తాలూకా ముందే రావడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ దక్కేది. ఇది రిలీజైన వారం రోజులకే అఖండ 2 తాండవం వస్తుంది. దాని మీద హైప్ ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. బాలయ్య కనక పాజిటివ్ టాక్ తో దూసుకుపోతే రెండో వారంలో ప్రవేశించిన రామ్ కు ఎంతో కొంత ఇబ్బంది అయితే తప్పదు. అదే నవంబర్ మధ్యలో వచ్చి ఉంటే సోలో రన్ దక్కి ఎక్కువ కలెక్షన్లు కళ్లజూడాల్సి వచ్చేది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఆంధ్రకింగ్ తాలూకాలో ఉపేంద్ర నిజ జీవితంలోని హీరో పాత్రే పోషిస్తున్నాడు. రామ్ తో తన ఎపిసోడ్స్ ఎక్సలెంట్ గా వచ్చాయని ఇన్ సైడ్ టాక్.