కొన్ని కొన్ని నిర్ణయాలు ఆసక్తిగా ఉంటాయి. దీంతో అలాంటి నిర్ణయాలపై ప్రజల్లో సహజంగానే సందేహాలు వస్తుంటాయి. ఫలితంగా ఆయా నిర్ణయాల వెనుక ఏం జరిగిందన్న విషయాలు తెలుసుకునేందుకు అత్యంత ఆసక్తి కనబరుస్తారు. ఇలాంటి నిర్ణయమే.. తాజాగా తెలంగాణలో జరిగింది. గురువారం రిటైర్ అయిన.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి.. రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టును ఇచ్చింది. లక్షల రూపాయల వేతనంతో ఈ పదవిని కట్టబెట్టింది.
వాస్తవానికి ఆయన రిటైర్మెంట్ కూడా పూర్తికాలేదు(గురువారం ఆయన డీజీపీగా పనిచేసినట్టే). ఇంతలోనే ఆగమేఘాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో ఓ ఉత్తర్వు బయటకు వచ్చింది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహారుపదవిలో నియమిస్తున్నట్టు దానిలో పేర్కొన్నారు. ఈ వ్యవహారమే ఆసక్తిగా మారింది. పదవీ విరమణ చేసిన తర్వాత.. కూడా ఈ పదవి ఇవ్వచ్చు. కొంత సమయం కూడా తీసుకోవచ్చు.
కానీ, ఇంత ఆగమేఘాలపై పదవిని ఇవ్వడం ఏంటనేది అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యం లోనే నెటిజన్లు.. శివధర్ రెడ్డికి-రేవంత్ రెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటనే విషయం ఆన్లైన్లోను.. ఆఫ్‌లైన్ లోనూ పెద్ద ఎత్తున ఆరా తీయడం గమనార్హం. నిజానికి సలహాదారు పదవులు ఇచ్చుకునే విషయంలో సీఎంకు స్వేచ్ఛ ఉంటుంది. దీనిని ఎవరూ కాదనరు. కానీ, ఒకవైపు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అని చెబుతూ.. మరోవైపు.. ఇలా లెక్కకు మించి సలహాదారులను నియమించడంపై ప్రశ్నలు వస్తున్నాయి.
శివధర్‌కు ఇదీ లబ్ధి!
ఇదిలావుంటే.. కొత్త పోస్టులో శివధర్ రెడ్డికి నెలకు 2లక్షల, 25 వేల రూపాయల వేతనం ఇవ్వనున్నారు. అలానే.. ఇంటి అద్దె కింద 50,000 రూపాయలుచెల్లిస్తారు. ప్రభుత్వ వాహనం, టీఏ/డీఏ, మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాలు అందిస్తారు. అంతేకాదు.. హోంశాఖ ఆయన కోసం ఒక ఓఎస్డీ, ప్రైవేట్ సెక్రటరీ, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లనుఏర్పాటు చేసి.. ప్రత్యేక సెంట్రల్ ఏసీతో కూడిన కార్యాలయాన్ని కూడా ఇస్తుంది.
ఇదే తొలిసారి కాదు..
అయితే.. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను వారు రిటైర్మెంట్ కాకుండానే కీలక సలహాదారులుగా నియమించడం తొలిసారి కాదు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శాంత కుమారి.. గత ఏడాది రిటైరయ్యారు. అయితే..ఆమె రిటైరయ్యే రోజే.. ఆమెకు కీలక పదవిని అప్పగించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు వైస్ చైర్ పర్సన్‌గా నియమించారు. అప్పట్లోనూ సీఎం వ్యవహారం చర్చనీయాంశం అయింది.
ప్రభుత్వం ఏం చెబుతోంది..?
కాగా.. ప్రస్తుతం డీజీపీ బి. శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించడంపై సర్కారు స్పందన వేరేగా ఉంది. ఆయన సేవలు తమకు అవసరమని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అనుభవం ఉందని పేర్కొంటోంది. కానీ.. ఇప్పటికిప్పుడు ఎందుకు ఈ పోస్టును సృష్టించి మరీ ఇచ్చారన్న దానిపై మాత్రం సర్కారు స్పందించడం లేదు.