hyderabadupdates.com movies ఇక, తేల్చాల్సింది టాలీవుడ్డే!

ఇక, తేల్చాల్సింది టాలీవుడ్డే!

తెలుగు వారి ప్ర‌ధాన పండుగ సంక్రాంతికి కేవ‌లం 70 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీంతో తెలుగు సినీ రంగం కోట్ల‌కు కోట్లు ధార‌పోసి.. కీల‌క చిత్రాల‌ను ప‌గులు రాత్రి కూడా.. పరుగులు పెట్టిస్తోంది. చిరంజీవి, ప్రభాస్ స‌హా.. అనేక మంది ప్ర‌ధాన న‌టుల సినిమాలు వ‌డివ‌డిగా సాగుతున్నాయి. ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా వెనుకాడ‌డ‌మూ లేదు. దేశ‌, విదేశాల్లోనూ ఏక‌కాలంలో సినిమా నిర్మాణాలు పుంజుకున్నాయి. వీరంద‌రికి ఒక్క‌టే ధీమా.. ప్ర‌భుత్వాలు.. టికెట్ల ధ‌ర‌లు పెంచుతాయ‌నే!.

ఇలా టికెట్ల ధ‌ర‌లు పెంచుకునే విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు భిన్న వాద‌న‌లు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. గ‌తంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్ర‌కారం.. టికెట్ల ధ‌ర‌లు పెంచుకోవ‌డం త‌ప్పుకాదు. అయితే.. ఇది ప్ర‌భుత్వాల విచ‌క్ష‌ణ‌పైనే ఉంటుంద‌ని కోర్టు తేల్చి చెప్పింది. సో.. ఈ కార‌ణంగానే చేతికి ఎముకలేకుండా నిర్మాణ సంస్థ‌లు సొమ్ములు ఖ‌ర్చుచేస్తున్నాయ‌న్న వాద‌న కూడా ఉంది. ఏదేమైనా.. ప్ర‌భుత్వాల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే ఆద‌ర‌ణ ఉంది.

ఉత్త‌రాది రాష్ట్రాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోని సినీ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌భుత్వాలు పెంచే టికెట్ల ధ‌ర‌లు ఊతాన్నిస్తున్నాయ‌ని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక‌, ఈ విష‌యంలో ఏపీ ఇటీవ‌ల కాలంలో ఉదారంగా ఉంది. డిప్యూటీసీఎంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా సినీ రంగం నుంచి రావ‌డంతోపాటు.. క‌ష్టాలు తెలుసు కాబ‌ట్టి ఆయ‌న ఉదారంగా స‌హ‌క‌రిస్తున్నారు. ఇదిలావుంటే.. తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించిన విష‌యం సినీ రంగంలో సంచ‌ల‌న చ‌ర్చ‌కు దారితీసింది.

టికెట్ల ధ‌రలు పెంచ‌గా వ‌చ్చే ఆదాయంలో 20 శాతం సొమ్మును కార్మికుల‌కు ఇవ్వాల‌న్న‌ది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌. దీనిని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. ఇక‌, ఇప్పుడు రాబోయే సినిమాల‌కు.. ఈ నిబంధ‌న వ‌ర్తించ‌నుంది. అంటే.. టికెట్ల ధ‌ర‌ల‌ను ఎంత పెంచినా.. దానిలో 20 శాతం మేర‌కు కార్మికుల‌కు ఇవ్వాలి. ఇది చెప్ప‌డానికి బాగానే ఉన్నా.. అమ‌లు ఎంత వ‌ర‌కు ? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. నిజానికి టికెట్ల ధ‌ర‌లు పెంచినా.. దానిలోకొంత మొత్తం ప‌న్నుల రూపంలో పోతుంది. మిగిలిన సొమ్ము మాత్ర‌మే నిర్మాత‌ల‌కు వ‌స్తుంది.

ఇక‌, ఇప్పుడు దీనిలో నుంచి 20 శాతం కార్మికుల‌కు ఇవ్వాలంటే.. మ‌రింత‌గా టికెట్ల ధ‌ర‌లు పెంచాలి. కానీ, స‌గ‌టు ప్రేక్ష‌కుడు.. అంత ధ‌ర పెట్టి హాలుకువచ్చి చూస్తారా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. అంతేకాదు.. పైర‌సీ భూతం వెంటాడుతున్న క్ర‌మంలో నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇలా విడుద‌లైన సినిమా.. అటా నెట్టింట్లోకి వ‌చ్చేస్తుండ‌డంతో టికెట్ల ధ‌ర‌లు పెంచినా ప్ర‌యోజ‌నం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి క్ర‌మంలో ఇప్పుడు 20 శాతం కార్మికుల‌కు ఇవ్వ‌డం అనేది క‌ష్ట‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related Post