hyderabadupdates.com movies ఈ దీపావళికి ఇదే పెద్ద సర్ప్రైజ్

ఈ దీపావళికి ఇదే పెద్ద సర్ప్రైజ్

ఈ దీపావళికి మూడు రోజుల వ్యవధిలో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. అన్ని సినిమాలూ ప్రామిసింగ్‌గా కనిపించడంతో గత దీపావళి లాగే ఈసారి కూడా 100 పర్సంట్ సక్సెస్ రేట్ చూస్తామా అన్న ఆశలు కలిగాయి. కానీ పండుగ రేసులో ముందుగా వచ్చిన ‘మిత్రమండలి’ అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వీకెండ్లోనే సినిమా చతికిలపడిపోయింది. మిగతా మూడు చిత్రాలకు అలాంటి రిజెక్షన్ కనిపించలేదు.

అన్నింట్లోకి తమిళ అనువాదమైన ‘డ్యూడ్’ బెటర్ టాక్, రివ్యూలు తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ సినిమా ‘తెలుసు కదా’కు మోడరేట్ రివ్యూలు వచ్చాయి. కిరణ్ అబ్బవరం మూవీ ‘కే ర్యాంప్’ బిలో యావరేజ్ రివ్యూలు, టాక్‌తో మొదలైంది. ఐతే వీకెండ్ అయ్యేసరికి బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూస్తే ‘కే ర్యాంప్’ పైచేయి సాధించడం విశేషం. దీనికి యుఎస్ ప్రిమియర్స్ నుంచి వచ్చిన రివ్యూలు, టాక్ చూస్తే డిజాస్టర్ అవుతుందేమో అనిపించింది. 

కానీ ఏపీ, తెలంగాణల్లో షోలకు బెటర్ టాక్ వచ్చింది. ఇక్కడి రివ్యూలు కూడా కాస్త మెరుగ్గా వచ్చాయి. బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ మాత్రం అందరి అంచనాలను మించిపోయింది. శని, ఆదివారాల్లో ఈ సినిమాకు హౌస్ ఫుల్ షోలు పడ్డాయి. సోమవారం దీపావళి పండుగ రోజు కూడా సినిమా బాగా పెర్ఫామ్ చేస్తోంది. తొలి రోజు ఈ మూవీ 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు అందుకు దీటుగా వసూళ్లున్నాయి. సోమవారం కూడా వసూళ్లకు ఢోకా లేదు కాబట్టి పది కోట్ల వసూళ్ల మార్కును ‘కే ర్యాంప్’ దాటేయబోతోంది. 

మరోవైపు ‘డ్యూడ్’ మూవీకి వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. కానీ మాస్ సెంటర్లలో ‘కే ర్యాంప్’ ఎఫెక్ట్ దాని మీద పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘తెలుసు కదా’ క్లాస్ మూవీ కావడంతో మల్టీప్లెక్సుల్లో రెస్పాన్స్ బాగుంది. బి, సి సెంటర్లలో కష్టపడుతోంది. ఓవరాల్‌గా చూస్తే ‘కే ర్యాంప్’, ‘డ్యూడ్’ దాదాపు సమాన స్థాయిలో సాగుతున్నప్పటికీ.. బ్యాడ్ టాక్, రివ్యూలతో మొదలైన ‘కే ర్యాంప్’ అంచనాలకు మించిన వసూళ్లను సాధించడం దీపావళికి అతి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు.

Related Post