పాన్ ఇండియా సూపర్ స్టార్ కావడానికి ముందైనా, తర్వాత అయినా ప్రభాస్‌లో ఏ మార్పూ లేదు. చాలా అణకువతో ఉంటాడు. అతను సిగ్గరి అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బయట కనిపించడం తక్కువ. మీడియాకు పెద్దగా దొరకడు. సినిమా ఈవెంట్లలోనూ పాల్గొనడు. దీంతో ప్రభాస్‌కు సంబంధించి ప్రతిదీ క్యూరియస్‌గా కనిపిస్తుంది. ఏదైనా ఈవెంట్లో, ప్రెస్ మీట్లో కనిపిస్తే ప్రభాస్ ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తుంటారందరూ.
అలాంటి ప్రభాస్ ఇప్పుడు తన కొత్త సినిమా రిలీజ్ లేకపోయినా.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో అతను చేసిన అల్లరి చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అమితానందానికి గురయ్యారు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ పేరుతో ఈ నెల 31న రీ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి, భల్లాలదేవ పాత్రధారి రానా దగ్గుబాటిలతో కలిసి ప్రభాస్ ఒక వీడియో ఇంటర్వ్యూ చేశాడు.
గంటకు పైగా నిడివితో ఈ ఇంటర్వ్యూ తెరకెక్కడం విశేషం. ముగ్గురూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ.. బాహుబలి తెర వెనుక విశేషాలను పంచుకుంటూ అభిమానులకు ఆహ్లాదాన్ని పంచారు. రానా, రాజమౌళి మంచి మాటకారులన్న సంగతి తెలిసిందే. తమ సినిమాలు అనేకాక వేరే చిత్రాల ఈవెంట్లకు, వేరే కార్యక్రమాలకు హాజరై అభిమానులను అలరిస్తుంటారు.
కానీ ప్రభాస్ ఇలా సుదీర్ఘ వీడియోతో జనాల ముందుకు రావడం మాత్రం అరుదు. అందులో ఆరంభం నుంచి చివరి దాకా ప్రభాస్ చాలా సరదాగా, ఉత్సాహంగా కనిపించాడు. తన స్టార్ ఇమేజ్ అంతా పక్కన పెట్టి ఒక మామూలు వ్యక్తిలా సింపుల్‌గా మాట్లాడుతూ, అల్లరి చేస్తూ దర్శనమిచ్చాడు ప్రభాస్. రానా రూపంలో మరో అల్లరోడు తోడవడంతో వీళ్లిద్దరి కెమిస్ట్రీ అదరిపోయింది.
ఇద్దరూ సరదాగా గొడవలు పడుతూ.. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ సాగారు. రెబల్ స్టార్‌ను ఇలా చూడడం అభిమానులకు ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో ప్రభాస్ కూడా ఈ ఇంటర్వ్యూను బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించాడు. తన ఫ్యాన్స్ గురించి ఇందులో అతను గొప్పగా మాట్లాడాడు. కర్నూలులో బాహుబలి షూట్ టైంలో అభిమానులతో అనుభవాల గురించి ప్రభాస్ చెప్పిన కబుర్లు భలే ఆకట్టుకున్నాయి. ఆ టైంలో కార్తికేయ, పోలీసులు తన ఫ్యాన్స్‌ను కొడుతుంటే.. పాపం వాళ్లను కొట్టొద్దు అంటూ విన్నవించడం, ఒక అభిమాని కార్లోనే తాను, రానా, రాజమౌళి కలిసి ప్రయాణించడం గురించి ప్రభాస్ చెప్పిన ముచ్చట్లు ఈ వీడియోలో హైలైట్.