తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. డేట్లు కూడా ప్రకటించారు. మరో పది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఎన్నికల జాబితాలను కూడా అధికారులు రెడీ చేస్తున్నారు. ఇక, పార్టీల పరంగా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్‌లు కూడా సర్వసన్నద్ధం అవుతున్నాయి. ప్రచార పర్వాలకు కూడా దిగేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ స్థానిక ఎన్నికలు జరగబోవమని అన్నారు. నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చని, కానీ.. ఈ ఎన్నికలు జరగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఎందుకంటే.. రాజ్యాంగ విరుద్ధంగా స్థానిక సంస్థల్లో ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోందన్నారు. దీనిని ఎవరూ ఒప్పుకోవడం లేదన్నారు. రేపు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే.. అప్పుడు ఎన్నికలు జరిగినా రద్దు చేసే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని దృస్టిలో పెట్టుకుని నాయకులు ఖర్చు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. దావత్‌లు కూడా ఇవ్వద్దన్నారు. ఈ క్రమంలో ఆయన పలు సూచనలు కూడా చేశారు.
గతంలో మహారాష్ట్రంలోనూ ఇలానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని ఈటల తెలిపారు. అప్పట్లో అక్కడ.. కూడా రిజర్వేషన్లు అమలు చేశారని.. కానీ, అవి రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టులో పలువురు పిటిషన్లు వేశారని తెలిపారు. ఫలితంగా ఆ ఎన్నికలను ఆరుమాసాల తర్వాత.. హైకోర్టు రద్దు చేసిందన్నారు. దీంతో ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ఖర్చు చేసిన వారు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకులు ఎవరూ ఖర్చు పెట్టొద్దని సూచించారు. ఈ ఎన్నికలు జరగబోవన్నారు.
బండి ఏం చేస్తున్నారు?: కాంగ్రెస్ ఫైర్
కాగా, ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుంటే ఓర్చుకోలేక పోతున్నారని ఆయన విమర్శించారు. బీసీ నాయకులమని చెప్పే.. ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్‌కు ఈటలను అదుపు చేసే బాధ్యతలేదా? అని ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఎన్నికలు జరగకూడదని బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించారు.