అవినీతి.. అడుగడుగునా చేతులు తడపాల్సిందే. పనికావాలన్నా.. మాట వినాలన్నా.. నోట్ల కట్టలు చేతులు మారాల్సిందే. ఇదీ.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉన్న పోలీసు స్టేషన్లలో కనిపిస్తున్న అవినీతి భూతం. ఇప్పటి వరకు అనేక వందల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే.. తాజాగా మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన ఇప్పటి వరకు జరిగిన అన్ని ఘటనలకు పరాకాష్ఠగా మారింది. అవినీతి అనకొండగా మారిన జిల్లాలోని టెక్మాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ వేధింపులతో ఆ ప్రాంత వాసులు విసిగిపోయారు. కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా లంచం రుచి మరిగిపోయారన్న ఆవేదన తాజాగా బాధితుల నోటి నుంచి వచ్చిందంటే.. సదరు ఎస్ ఐ ఏ రేంజ్‌లో అవినీతికి పాల్పడ్డాడో తెలుస్తుంది.
అయితే.. రోజులు అన్నీ ఒకేలా ఉండవు. ఏదో ఒక రోజు ఏసీబీకి పట్టుబడక తప్పదు. ఈ చిన్న లాజిక్‌ను మరిచిపోయిన ఎస్ ఐ రాజేష్.. తాజాగా స్టేషన్ లోనే దర్జాగా రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. అయితే.. ఏసీబీ అధికారులు స్టేషన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే గమనించిన రాజేష్.. 30 వేల రూపాయలను గాలిలోకి విసిరేసి.. ఒక్క ఉదుటన పరుగు లంఖించుకున్నాడు. సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి పారిపోయాడు. అయితే.. వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు.. స్థానిక యువత సాయంతో పారిపోతున్న ఎస్సైను వ్యవసాయ పొలాల వద్ద పట్టుకున్నారు. అనంతరం.. ఆయనను స్టేషన్‌కు తీసుకువచ్చి అరెస్టు చేశారు.
ఓ కేసులో ఫిర్యాదు తీసుకునేందుకు.. కేసునమోదు చేసుకునేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం కోరగా.. సదరు వ్యక్తి 30 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అయితే.. ఆ వెంటనే అవినీతి ఎస్సై ఉదంతాన్ని ఏసీబీకి కూడా ఉప్పందించారు. దీంతో పక్కా ప్రణాళికతో ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు స్టేషన్‌లో నే కూర్చుని 30 వేల రూపాయల లంచం సొమ్మును తీసుకుంటుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే.. వీరివిషయాన్ని గ్రహించిన ఎస్ ఐ వెంటనే పరుగు పెట్టి సమీపంలోని పొలాల్లోకి పారిపోయాడు. కాగా.. అరెస్టు చేసిన ఎస్సైపై గతంలోనూ పలు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు.
పీడ విరగడైంది: స్థానికులు..
ఎస్ ఐ రాజేష్ అరెస్టుతో స్థానికులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నిజానికి దీపావళి పండుగ ఇప్పుడే తమకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. ఏ చిన్న కేసుపై స్టేషన్‌కు వెళ్లినా.. తమను పురుగుల్లా చూశాడని.. రూపాయి ముడితేనే పనులు చేసేవాడని చెప్పారు. దీంతో స్థానికులు కొందరు స్టేషన్ ముందే టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కొందరు మిఠాయిలు కూడా పంచుకున్నారు. అయితే.. వ్యవస్థీకృత లోపం, పోలీసులు అంటే.. అధికార పెత్తనం కోసమే వచ్చామన్న అభిప్రాయం మెండుగా స్థిరపడిపోయిన నేపథ్యంలోనే ఇలాంటి అధికారులు అవినీతి బాట పడుతున్నారని కొందరు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టి స్టేషన్లను సంస్కరించాలని చెబుతున్నారు.