రాష్ట్రంలో కొత్త ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? వారు.. ప్రజలకు ఏమేరకు చేరువ అవుతున్నారు? .. ఈ ప్రశ్నలు ఎవరో.. ప్రత్యర్థులు అడుగున్నవి కాదు. సాక్షాత్తూ వారికి టికెట్ ఇచ్చి.. వారు గెలిచేలా ప్రోత్సహించి, ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు వస్తున్న డౌట్లు. ఈ క్రమంలోనే కొత్తవారిని దారిలో పెట్టాల్సిన బాధ్యతను వారిని సరైన విధంగా ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యతను కూడా ఇంచార్జ్ మంత్రులకు అప్పగించారు. అయితే.. వారు ఈ బాధ్యతల విషయంలో విముఖత వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో స్వయంగా సీఎం చంద్రబాబే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అసలు కొత్తవారి పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఐవీఆర్ఎస్ సహా.. పార్టీ కీలక వర్గాల నుంచి చంద్రబాబు సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. తాజాగా పలు నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యాలయానికి వచ్చిన సమాచారం మేరకు.. కొత్త ఎమ్మెల్యేల వైఖరి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉందని తెలిసింది.
కొందరు పార్టీ అధినేత చెప్పినట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు చేరువ అవుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వీరి సంఖ్య ఆశించిన రీతిలో లేదని పార్టీ భావిస్తోంది. మొత్తం 60 మందికి పైగా కొత్త నేతలు విజయం దక్కించుకుంటే.. వీరిలో 20 శాతం మంది మాత్రమే ప్రజలకు చేరువగా ఉంటున్నారని సమాచారం.
మరో 80 శాతం మందిలో 20 శాతం మంది.. అటు ఇటుగా వ్యవహరిస్తున్నారని పార్టీ కార్యాలయానికి నివేదిక చేరినట్టు తెలిసింది. వీరిలో కొందరు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎక్కువ సమయంలో సొంత వ్యాపారాలకు కేటాయిస్తున్నారు. అంటే.. పార్టీ కార్యక్రమాలకు వచ్చినట్టు చెబుతూ.. ఆ తర్వాత.. వారి సొంత వ్యవహారాలకు పరిమితం అవుతున్నారు. మరో 30 శాతం మంది అసలు నియోజకవర్గంలోనే ఎక్కువగా కనిపించడం లేదని సమాచారం. ఇంకొందరు.. అంటే.. 10 శాతం మేరకు నాయకులు వైసీపీ నేతలతో కలివిడిగా ఉన్నట్టు తెలిసింది. ఇలా.. కొత్త నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారన్నది పార్టీ వర్గాలకు అందిన సమాచారం.