విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో కొత్త చరిత్రను సృష్టించనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే కూడా.. అతి పెద్ద పరిశ్రమ నక్కపల్లిలో రానుందన్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్సెలార్ మిట్టల్ కు చెందిన ఉక్కు పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు శంకు స్థాపన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహకారం అందనుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నక్కపల్లిలో మిట్టల్ ఉక్కు పరిశ్రమ ద్వారా కొత్త చరిత్ర లిఖించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. మిట్టల్ పెట్టుబడి భారీ గొప్ప మలుపుగా పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కానుందని, ప్రపంచంలోనే నెంబర్ ఉక్కును ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. ఎన్నికల హామీలలో కీలకమైన `రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్న` హామీని ఈ ప్రాజెక్టు ద్వారా నిలబెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం వంటి కీలక హామీలను అమలు చేశామన్నారు.
నక్కపల్లిలో నిర్మించేది ఉక్కు పరిశ్రమ కాదని.. ఉక్కునగరమని చంద్రబాబు అభివర్ణించారు. ఇది ఏపీకే కాకుండా.. దేశానికే తలమానికంగా మారుతుందన్నారు. తమ ప్రభుత్వం పదే పదే చెబుతున్న `స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్`కు ఈ పరిశ్రమ ఏర్పాటు నిలువుటద్దమని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ కోసం.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూ సమీకరణ చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులుగాతీసుకువచ్చామని.. 6 లక్షల మందికిపైగా ఉద్యోగ, ఉ పాధి అవకాశాలు కల్పించామని సీఎం చెప్పారు. రాబోయే మూడేళ్లలో 20 లక్షల మంది(మొత్తం)కి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పరిశ్రమ సమగ్ర స్వరూపం..
+ పరిశ్రమ పేరు: ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ.+ ప్రభుత్వం కేటాయించిన భూమి: 5,465 ఎకరాలు+ ఉద్యోగ, ఉపాధి లభించే వారిసంఖ్య: 1.2 లక్షలు+ ఉక్కు ఉత్పత్తి ప్రారంభమయ్యేది: 2028, అక్టోబరు+ మిట్టల్ యాజమాన్యం పెట్టుబడి: రూ.87 వేల కోట్లు(తొలిదశ)